ONGC: కోనసీమ జిల్లాలో గ్యాస్ లీక్ కలకలం.. మలికిపురంలో భయాందోళనలు

కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో ఓఎన్‌జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీక్ జరగడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అధికారులు చర్యలు చేపట్టారు.

Update: 2026-01-05 09:38 GMT

ONGC: కోనసీమ జిల్లాలో గ్యాస్ లీక్ కలకలం.. మలికిపురంలో భయాందోళనలు

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపింది. మలికిపురం మండలంలోని ఇరుసుమండ ప్రాంతంలో ఉన్న ఓఎన్‌జీసీ డ్రిల్ సైట్ నుంచి సోమవారం మధ్యాహ్నం భారీగా గ్యాస్ లీక్ అయ్యింది. సుమారు రెండు గంటల పాటు గ్యాస్ పైకి చిమ్మడంతో చుట్టుపక్కల గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

గ్యాస్ లీక్‌ను గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. సంఘటనపై స్పందించిన స్థానిక తహసీల్దార్ శ్రీనివాసరావు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఓఎన్‌జీసీ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో, సంస్థకు చెందిన సాంకేతిక నిపుణులు అక్కడికి చేరుకుని లీక్‌ను నియంత్రించే చర్యలు చేపట్టారు.

గ్యాస్ లీక్ కారణంగా సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రతాపరమైన చర్యలు మరింత పటిష్టంగా తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

మలికిపురం మండలంలో ఇలాంటి ఘటనలు ఇదే తొలిసారి కాదని స్థానికులు గుర్తు చేస్తున్నారు. గతంలో 2025 మార్చిలో కేశనపల్లి ప్రాంతంలోని గ్యాస్ గ్యాదరింగ్ స్టేషన్‌లో గ్యాస్ లీక్ ఘటన జరగగా, అప్పట్లో తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో అప్పుడప్పుడు గ్యాస్ లీక్ ఘటనలు జరుగుతుండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ, శాశ్వత పరిష్కారం కోరుతున్నారు.

Tags:    

Similar News