విశాఖ తీరంలో మరోసారి వల వివాదం.. నడి సముద్రంలో వాగ్వాదం.. బోట్లకు నిప్పు...

Visakhapatnam - Fishermen Dispute: వివాదానికి తెరదించేందుకు రంగంలోకి మంత్రులు, అధికారులు...

Update: 2022-01-05 03:22 GMT

విశాఖ తీరంలో మరోసారి వల వివాదం.. నడి సముద్రంలో వాగ్వాదం.. బోట్లకు నిప్పు...

Visakhapatnam - Fishermen Dispute: సముద్రమే వారి జీవితం.. సముద్రమే వారి జీవనం.. సముద్రమే వారికి ఉపాధి.. సముద్రంతోనే వారి బ్రతుకులు ముడిపడి ఉన్నాయి. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా గంగమ్మ తల్లినే నమ్ముకున్న గంగపుత్రులు.. వేట సాగక, పూట గడవక జీవనం సాగిస్తున్న తరుణంలో రింగు వల రెండు గ్రామాల మద్య చిచ్చు రేపుతోంది. కయ్యానికి కాలు దువ్వుతోంది. ఢీ అంటే ఢీ అంటుంది.విశాఖ హార్బర్ నుంచి భీమిలి తీరం వరకు దాదాపు అన్ని మత్స్యకార గ్రామాల గంగపుత్రులు.. రింగు వలలతో వేట సాగిస్తున్నారు.

దీంతో సాంప్రదాయ మత్స్యకారులు రింగు వలలను నిషేదించమని కొన్ని నెలలుగా నిరసనలు చేశారు. దీనిపై అధికారులతో చర్చలు జరిపినా.. ఫలితం లేకపోవడంతో కొందరు రింగు వలల మత్స్యకారులు హైకోర్టును అశ్రయించారు. 13 బోట్లకు మాత్రమే రింగు వలలతో సముద్ర తీరానికి అనుమతిచ్చిన కోర్టు.. ఎనిమిది కిలోమీటర్ల అవతల వేట చేయవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. రింగు వలల మత్స్యకారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, తీరానికి సమీపంలో వేట చేయటం వలన మత్స్య సంపద నాశనమైపోతోందని సాంప్రదాయ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వారం రోజులుగా జాలరిఎండాడ జాలర్లు రింగు వలలతో చేపల వేట సాగిస్తున్నారు. చేపలు కూడా ఎక్కువుగా లభ్యమవుతుండడంతో సంతోషంగా సాగిపోతున్న తరుణంలో పెద్దజాలరిపేట, చిన్నజాలరిపేట మత్స్యకారుల మధ్య రింగు వలల వివాదం మరోసారి చోటు చేసుకుంది. రింగు వలలతో మత్స్యకారులు వేటకు వెళ్లడంతో.. సాంప్రదాయ మత్స్యకారులు వారిని అడ్డుకోవడం వివాదానికి దారి తీసింది. దీంతో.. సముద్రంలోని బోట్లకు సాంప్రదాయ మత్స్యకారులు నిప్పు పెట్టారు.

ఈ ఘటనలో ఏడు బోట్లు కాలిపోగా.. నలుగురికి గాయాలయ్యాయి. దీంతో వాసవానిపాలెం తీరం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ భారీగా మోహరించారు.మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. వాసవానిపాలెం, జాలరి పేటలలో 144 సెక్షన్ అమలు చేశారు. మత్స్యకారులు పోలీసులకు సహాకరించాలని విశాఖ నగర పోలీస్ కమీషనర్ మనీష కుమార్ సిన్హా తెలిపారు.

వాసవానిపాలెం, జాలరిపేట, మంగమారిపేట, ఫిషింగ్ హార్బర్‌లో పోలీస్ పికెట్ పాయింట్ పెట్టామని, రాత్రి పహారా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరంచారు. మత్స్యకారుల మధ్య వివాదం, బోట్లు తగలబెట్టిన ఘటనపై మెరైన్ పోలీస్ స్టేషన్ ఋషికొండలో కేసు నమోదవుతుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. మత్స్యకారుల మధ్య వివాదానికి తెరదించే విధంగా మంత్రులు, అధికారులు మరోసారి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆ చర్చలు సఫలమవుతాయా..? విఫలమవుతాయా..? వేచి చూడాల్సిందే...

Tags:    

Similar News