పల్నాడు జిల్లాలో కాల్పుల కలకలం.. తెదేపా మండలాధ్యక్షుడికి గాయాలు
Palnadu: రొంపిచర్ల మండలం అలవాలలో అర్థరాత్రి తుపాకీ కాల్పులు
పల్నాడు జిల్లాలో కాల్పుల కలకలం.. తెదేపా మండలాధ్యక్షుడికి గాయాలు
Palnadu: పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో రాత్రి మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నబాలకోటేశ్వరరెడ్డిపై పిస్టల్ తో కాల్పులు జరిగాయి. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో బాలకోటేశ్వర రెడ్డిని వెలుపలికి పిలిచి దారుణానికి పాల్పడ్డారు. కాల్పులకు పాల్పడింది పమ్మి వెంకటేశ్వరరెడ్డిగా గుర్తించారు. పిస్టల్‌లోంచి దూసుకెళ్లిన బుల్లెట్ బాలకోటిరెడ్డి ఎడమవైపునుంచి పొట్టలోకి దూసుకెళ్లింది. మరో బుల్లెట్ గురితప్పి పక్కకు దూసుకుపోయింది.
కాల్పులు జరిపిన తర్వాత దుండగులు పరారయ్యారు. కాల్పులు జరిపిన వారిలో పమ్మి వెంకటేశ్వరరెడ్డితోపాటు పూజల రాముడు, గడ్డం వెంకట్రావు ఉన్నారని బాధితుడు తెలిపారు. తుపాకి తూటాకు గురైన బాలకోటిరెడ్డిని అత్యవసరంగా నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తుపాకి కాల్పులకు గురైన బాల కోటిరెడ్డిని టిడిపి ఇన్ ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పరామర్శించారు.