East Godavari: పిఠాపురం లో కల్తీ పురుగుల మందు తయారీ

East Godavari: విరవాడ రైతు డిపో యజమాని రాజేష్ నిర్వాకం * నిషేధిత కలుపు నివారణ మందు డకన్‌డవ్‌ తో నకిలీ మందు తయారీ

Update: 2021-03-25 05:37 GMT
నకిలీ పురుగుల మందులు (ఫైల్ ఫోటో)

East Godavari: తినే తిండి కల్తీ.. తాగే పాలు కల్తీ.. చివరికి రైతు పంటను రక్షించే పురుగు మందును సైతం కల్తీ చేస్తున్న కేటుగాళ్ల గుట్టును విజిలెన్స్‌ అధికారులు రట్టు చేశారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం విరవాడ గ్రామంలో నకిలీ కలుపు నివారణ మందును తయారు చేస్తున్న దందాకు చెక్‌ చెప్పారు. భారీ స్థాయిలో రసాయనాలు, వివిధ కంపెనీలకు చెందిన పురుగు మందు డబ్బాలు స్టిక్కర్లు స్వాధీనం చేసుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లా సహా పలు జిల్లాల్లో కలుపు నివారణ మందు డకన్‌డవ్‌ను వ్యవసాయ శాఖ నిషేదించింది. దీనిని రైతు డిపోల్లో అమ్మరాదని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. విరవాడ నకిలీ మందుల తయారీకి ఇదే ఆసరాగా నిలిచింది. నిషేదిత మందును భారీ స్థాయిలో కొనుగోలు చేసిన మాయగాళ్లు అదే మందును ఇతర కలుపు నివారణ కంపెనీల సీసాలు, డబ్బాల్లో నింపి వాటిపై నకిలీ స్టిక్కర్లు అంటించి రైతులకు అంటగట్టేస్తున్నారు. ఒక్కో బాటిలు 1800 రూపాయలకు కూడా అమ్మేస్తున్నారని తెలుస్తోంది.

నకిలీ బాటిళ్లు, స్టిక్కర్లపై అక్రమార్కులు బ్యాచ్‌ నెంబర్లు, కాలపరిమితి కూడా ముద్రించి అమ్మేస్తున్నారు. ఖచ్చితంగా ఒరిజినల్‌ కంపెనీని తలదన్నే రీతిలో మందును తయారు చేస్తున్నారు. ఈ నకిలీ మందులను జిల్లాలోనే కాకుండా తెలంగాణ తదితర రాష్ట్రాలకు సైతం ఎగుమతి చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు మందు ధర కంటే తక్కువకు వస్తుండటంతో డీలర్లు వీటిని సులభంగా కొనుగోలు చేస్తున్నారని సమాచారం. అయితే వీటిని కొన్న రైతులు మాత్రం నిండా మునిగిపోతున్నారు. రైతు డిపో యజమాని రాజేష్‌పై కేసు నమోదు చేస్తున్నట్లు విజిలెన్స్‌ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News