Farmers: పార్టీలు మారినా.. ప్రభుత్వాలు మారినా... ఆ రైతుల తలరాతలు మారడం లేదు...
Farmers: దశాబ్దాలుగా సాగు నీటి కోసం నల్లమడ ప్రాంతవాసుల పోరాటం
Farmers: పార్టీలు మారినా.. ప్రభుత్వాలు మారినా... ఆ రైతుల తలరాతలు మారడం లేదు...
Farmers: పార్టీలు మారినా.. ప్రభుత్వాలు మారినా... ఆ రైతుల తలరాతలు మారడం లేదు... ఆ ప్రాంతంలో రైతులు దశాబ్దాలుగా సాగు నీటి కోసం పోరాడుతున్నారు.... గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించాలన్న ఇక్కడి రైతుల డిమాండ్ నెరవేరడం లేదు.. ఎన్నికల సమయంలో నేతలు ఇస్తున్న హామీలు... గెలిచిన తర్వాత గట్టున పెట్టేస్తున్నారు... దీంతో ఐదు మండలాల ప్రజలు సాగు, తాగు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు.... నలమడ కాలువ పొడిగింపుపై గుంటూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దు మండలాల్లో 80 ఏళ్లుగా ఉద్యమాలు జరుగుతున్నా.. ప్రభుత్వాలు స్పందించడం లేదు.
ప్రకాశం బ్యారేజీకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది నల్లమడ ప్రాంతం... సాగు, తాగునీటికి సమస్య ఉందంటే అందరని అశ్చర్యం కలిగిస్తోంది. కృష్ణా బ్యారేజీ నిర్మాణ సమయంలోనే పెదనందిపాడు హై లెవల్ కెనాల్ నిర్మించాలనే డిమాండ్ వచ్చింది.. పెదనందిపాడు కాలువగా కాకుండా దీనికి గుంటూరు ఛానల్ అని పేరు పెట్టి 1965లో పనులు చేపట్టారు... పేరేదైనా నీరొస్తుందని ప్రజలు ఆశపడ్డారు.... కానీ పెదనందిపాడు మండలం యామర్తి వరకు మాత్రమే కాలువలు తవ్వారు.
దీంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది... గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించాలంటూ 2002లో రైతులు ఉద్యమించారు... 2006లో వైఎస్ సీఎంగా ఉండగా... జలయజ్ఞంలో భాగంగా కాలువ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.. అయినా పని జరగలేదు. 2009, 2017, 2018లో కూడా రైతులు పాదయాత్రలు, దీక్షలు చేపట్టారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించారు... 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ కూడా కాలువ పొడిగింపుపై హామీ ఇచ్చారు. జగన్ ముఖ్యమంత్రి హోదాలో 2022 జనవరి 1న ప్రత్తిపాడు వచ్చినప్పుడు కూడా మరోసారి హామీ ఇచ్చారని రైతులు తెలిపారు.
అయితే గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగింపుపై సర్వే ముగిసింది. పనులు ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చి 15 నెలలైంది. ఇప్పటికీ ఒక్క ఇటుకా వేయలేదు. సరైన నీటి వసతి లేని కారణంగా నాగార్జునసాగర్ డ్రెయిన్ నుంచి వచ్చే నీటినే పొలాలకు మళ్లించుకుని పంటలు పండించుకుంటున్నారు. తాగు నీటికి కూడా ఇబ్బంది ఉంది. 2023-24 బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే సుచరిత చెప్పారు... కానీ బడ్జెట్‌లో దీనికి నిధుల ప్రస్తావన లేకపోవడం రైతుల్లో ఆగ్రహం తెప్పించింది. రైతులు మరోసారి దీక్షలకు దిగారు. ఈ ప్రాంతానికి వచ్చి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయకపోతే ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఈ కాలువల విస్తరణకు భూసేకరణ కోసం 113 కోట్ల రూపాయలు కావాలి.... ముందుగా ఆ నిధులు విడుదల చేస్తే భూమిని రైతులు స్వాధీనం చేస్తారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి నిధులు కేటాయిస్తే పనులు మొదలవుతాయి. ప్రకాశం బ్యారేజీలో నీరు ఎప్పుడూ ఉంటుంది... కాబట్టి నీటి సమస్య తలెత్తే అవకాశం లేదని, ఈ సమస్యపై ఉద్యమిస్తున్న నల్లమడ రైతు సంఘం అధ్యక్షుడు కొల్లా రాజమోహన్ చెబుతున్నారు.
గుంటూరు ఛానల్ విస్తరణతో నాలుగు మండలాల్లోని 50 గ్రామాలకు తాగు నీరు, 50 వేల ఎకరాలకు సాగు నీరు అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రాంతానికి ఎంతో కీలకమైన ప్రాజెక్టు పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. పోలవరం వంటి పెద్ద ప్రాజెక్టుల విషయంలోనే ఉదాసీనంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం... ఇలాంటి చిన్న ప్రాజెక్టు విషయంలో ఏ మేరకు ముందుకెళ్తుందనేది అనుమానమే.