మోస్ట్ వాంటెడ్ హిడ్మా సహా ఆరుగురు మావోయిస్టుల మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు.
మారేడుమిల్లి: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు కాల్పులు జరపగా, ప్రతిగా బలగాలు గట్టి స్పందన ఇచ్చాయి.
మృతుల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా, అతని భార్య రాజీ, ఇంకా నలుగురు అనుచరులు ఉన్నట్లు ఏపీ డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి ఆ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్–ఛత్తీస్‌గఢ్–ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు.
హిడ్మా నేపథ్యం
ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా పూర్వాటి గ్రామానికి చెందిన హిడ్మా, చిన్న వయసులోనే మావోయిస్టు దళంలో కీలక స్థానానికి ఎదిగాడు. గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరుపొందిన ఆయన, పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్‌గా మరియు దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యుడిగా పనిచేశాడు.
ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్
అదేవిధంగా మంగళవారం ఉదయం ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా ఎర్రబోరు ప్రాంతంలో కూడా మావోయిస్టులు–భద్రతా బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒక మావోయిస్టు మృతిచెందాడని జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ వెల్లడించారు. ఆ ప్రాంతంలో కూడా కూంబింగ్ కొనసాగుతున్నట్లు తెలిపారు.