AP Election 2024: హోరాహోరీ ప్రచారానికి తెర... గత ఎన్నికలతో పోల్చితే ఈసారి ప్రచారంలో ప్రత్యేకత ఏంటి?

AP Election 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి, పార్లమెంట్ కు మే 13 ఎన్నికలు జరగనున్నాయి.పోలింగ్ కు అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Update: 2024-05-11 12:15 GMT

AP Election 2024: హోరాహోరీ ప్రచారానికి తెర... గత ఎన్నికలతో పోల్చితే ఈసారి ప్రచారంలో ప్రత్యేకత ఏంటి?

AP Election 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి, పార్లమెంట్ కు మే 13 ఎన్నికలు జరగనున్నాయి.పోలింగ్ కు అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకొనేందుకు ప్రధాన రాజకీయపార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి.ప్రచారం ముగిసింది. ఇక ఓటర్ల ప్రలోభాలకు పార్టీలు తెరతీయనున్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగాయి. వైఎస్ఆర్ సీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం) మరో కూటమిగా పోటీ చేస్తున్నాయి.ఓటర్లను ఆకట్టుకొనేందుకు రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేశాయి.

ఎన్ డీ ఏ కూటమి తరపున ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లు ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్ సీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ అన్నీ తానై ప్రచారాన్ని ముందుకు నడిపించాడు. ఇక కాంగ్రెస్ కూటమి తరపున రాహుల్ గాంధీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలలు ప్రచారం నిర్వహించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ,సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలు కాంగ్రెస్ కూటమి తరపున ప్రచారం నిర్వహించారు.

జగన్ టార్గెట్ గా ఎన్ డీ ఏ కూటమి ప్రచారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ టార్గెట్ గా ఎన్ డీ ఏ కూటమి ప్రచారం నిర్వహించింది.ఐదేళ్ల క్రితం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చోటు చేసుకున్న రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రధానంగా కూటమి నేతలు ప్రస్తావించారు. జగన్ సర్కార్ అనుసరించిన విధానాల కారణంగా రాష్ట్రంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. అభివృద్ది కుంటుపడిందని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పేదల కోసం కాకుండా మాఫియా కోసం వైఎస్ఆర్సీపీ సర్కార్ పనిచేస్తుందని పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో జరిగిన సభలో విమర్శలు చేశారు. ఐదేళ్లుగా అవినీతి రాజ్యమేలిందనే ఆరోపణలు కూడ ప్రధాని చేశారు. ఎన్డీఏది అభివృద్ది మంత్రమైతే వైసీపీది మాత్రం అవినీతి మంత్రం అని ఆయన ఎద్దేవా చేశారు.

మరో వైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లు ఉమ్మడిగానూ, విడివిడిగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.బీజేపీ ఏపీ రాష్ట్ర అధ‌్యక్షురాలు పురంధేశ్వరి కూడ కూటమి అభ్యర్థుల తరపున రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. టీడీపీ, జనసేనలు మేనిఫెస్టో గురించి ఎన్నికల ప్రచార సభల్లో ప్రస్తావించారు. జగన్ ఐదేళ్ల కాలంలో సంక్షేమ పథకాల పేరు చెప్పి ప్రజలను మభ్య పెట్టారని ఆరోపించారు.

బటన్ నొక్కుడంటూ అవినీతికి పాల్పడ్డారని జగన్ పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. అదే సమయంలో తమ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇదిలా ఉంటే బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వం నుండి ఐదేళ్ల కాలంలో రాష్ట్రానికి వచ్చిన నిధుల గురించి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటైతే కలిగే ప్రయోజనాలు వివరిస్తున్నారు. ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రస్తావిస్తున్నారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు లక్ష్యంగా జగన్ ప్రచారం సాగుతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదల ప్రజల కోసం ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ప్రస్తుతం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రద్దు చేస్తారని జగన్ ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో అధికారం దక్కించుకొనేందుకు కూటమి పేరుతో చంద్రబాబు ప్రజల వద్దకు వస్తున్నాడని జగన్ విమర్శలు గుప్పిస్తున్నారు.

గతంలో చంద్రబాబునాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తావించిన అంశాలను అమలు చేయలేదని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇచ్చిన హామీలను కూడ అమలు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 95 శాతం హామీలను అమలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో దాడులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో రాళ్ల దాడి చోటు చేసుకోవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. ఈ ఏడాది ఏప్రిల్ 13న విజయవాడ సింగ్ నగర్ లోని వివేకానంద స్కూల్ వద్ద ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో రాయి దాడి జరిగింది. ఈ ఘటనలో జగన్ ఎడమ కంటి కనుబొమ్మకు గాయమైంది. ఈ ఘటనకు భాద్యులను గుర్తించిన పోలీసులు నిందితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఈ విషయాన్ని రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకొనేందుకు జగన్ ప్రయత్నించారని ప్రత్యర్ధి పార్టీలు ఆరోపణలు చేశాయి. ఈ ఘటనపై టీడీపీపై వైఎస్ఆర్సీపీ విమర్శలు చేసింది. జగన్ పై దాడి జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు నిర్వహించిన ఎన్నికల సభల్లో కూడ ఇదే రకంగా రాళ్ల దాడులు జరిగాయి.అయితే వీరిద్దరికి ఎలాంటి గాయాలు కాలేదు.

రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా పలు పార్టీల అభ్యర్థులు, నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దాడులు చోటు చేసుకున్నాయి. అనకాపల్లి ఎంపీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన సీఎం రమేష్ పై వైఎస్ఆర్ సీపీ అభ్యర్ధి బూడి ముత్యాలనాయుడు వర్గీయులు దాడికి దిగారు.ఈ దాడి నుండి పోలీసులు సీఎం రమేష్ ను రక్షించారు. మరో వైపు పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు తన వాహనాలపై దాడికి దిగారని బీసీవైపీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ ఆరోపించారు. ఓటు ద్వారా ప్రజలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బుద్ది చెప్పాలని ఆయన కోరారు.

మరో వైపు ఈ నియోజకవర్గంలో స్వేఛ్చగా ఎన్నికల నిర్వహణకు గాను కేంద్ర బలగాలను మోహరించాలని రాజంపేట ఎంపీ స్థానం నుండి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్ధి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇక హోంమంత్రి తానేటి వనితపై టీడీపీ వర్గీయులు దాడికి యత్నించారని వైసీపీ ఆరోపించింది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో వైసీపీ నేత సుబ్రమణ్యం ఇంటికి వచ్చిన మంత్రి వనితపై టీడీపీ శ్రేణులు దాడి చేసే ప్రయత్నం చేయడంతో సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రకటించాయి.ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

విశాఖ‌ ఉక్కుపై పార్టీల హామీలు

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయమై ప్రధాన పార్టీలు ఓటర్లకు హామీలు కురిపిస్తున్నాయి. ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటు వేస్తే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేస్తారని వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేస్తుంది. విశాఖపట్టణం కేంద్రంగా నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఈ విషయమై ఆ పార్టీ విమర్శలు చేసింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా తాను ఇంతకాలం అడ్డుకున్నట్టుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.ఇదిలా ఉంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా అడ్డుకుంటామని టీడీపీ నేతలు కూడ హామీలు కురిపిస్తున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరసిస్తూ జేఏసీగా ఏర్పడి కార్మికులు నిరసనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మికుల ఓట్లు ఆయా పార్టీల గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు.

సంక్షేమ పథకాలకు నిధుల విడుదల.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పరస్పర ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు నిధుల విడుదల విషయమై ఈసీ స్పష్టత ఇచ్చింది. మే మాసంలో సంక్షేమ పథకాల( విద్యాదీవెన, రైతు భరోసా) విడుదలకు సంబంధించి నిధులు విడుదలకు సంబంధించి సీఎం జగన్ బటన్ నొక్కారు. కానీ, నిధులను మే మాసంలో విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే ఈ నిధుల విడుదలకు ఈసీ బ్రేక్ వేసింది.ఈ విషయమై కొందరు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన ఏపీ హైకోర్టు ఇరువర్గాల వాదనలను విన్నది. తీర్పును రిజర్వ్ చేసింది.

జనవరి నుండి మార్చి 16 వరకు పలు పథకాల కింద లబ్దిదారులకు నిధులను బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయలేదు. ఈ నిధులను ఎన్నికలకు ముందు విడుదల చేయడంతో దాని ప్రభావం ఎన్నికలపై ఉండే అవకాశం లేకపోలేదనే ప్రచారం కూడ సాగుతుంది. దరిమిలా పోలింగ్ తర్వాత ఈ నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సంక్షేమ పథకాల నిధుల విడుదల బ్రేక్ కు టీడీపీ కారణమని వైఎస్ఆర్సీపీ ఆరోపణలు గుప్పించింది. అయితే వైఎస్ఆర్ సీపీ ఆరోపణలను టీడీపీ తోసిపుచ్చింది.

ఇక మరోవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై వైసీపీ,ఎన్డీఏ కూటమి మధ్య పరస్పర ఆరోపణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ యాక్ట్ ద్వారా ప్రజల భూములను ప్రభుత్వం తీసుకొంటుందని ఎన్ డీ ఏ కూటమి ప్రచారం చేస్తుంది. సంస్కరణల్లో భాగంగా తీసుకు వచ్చిన ఈ చట్టం విషయంలో కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్ కౌంటరిస్తున్నారు. ప్రపంచంలోని సుమారు యాభైకి పైగా దేశాల్లో ఈ తరహా చట్టం ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. ఈ చట్టం వల్ల ప్రజలకు నష్టమనే విషయాన్ని ప్రధానితో చెప్పించాలని కూడ వైసీపీ నేతలు కూటమి నేతలకు సవాల్ విసురుతున్నారు.

అధికారుల బదిలీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే నెపంతో ఎన్ డీ ఏ కూటమి తరపున ఈసీకి ఫిర్యాదులు చేయడంతో క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులను ఈసీ బదిలీ చేసింది. పోలీస్ శాఖతో పాటు ఇతర శాఖల్లోని అధికారులను కూడ ఈసీ బదిలీ చేసింది. తొలుత ఎస్ఐ, సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులపై ఈసీ వేటేసింది.ఆ తర్వాత రాష్ట్ర స్థాయి అధికారులపై కూడ ఈసీ బదిలీ చేసింది.ఏపీ రాష్ట్ర డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేసింది. రాజేంద్రనాథ్ రెడ్డి స్థానంలో హరీష్ కుమార్ గుప్తాను ఈసీ నియమించింది. పెన్షన్ల పంపిణీ విషయంలో అధికారులు వ్యవహరించిన తీరుపై టీడీపీ కూటమి అధికారుల తీరుపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అధికార పార్టీకి ప్రయోజనం కలిగించేలా అధికారులు వ్యవహరించారని ఆరోపించారు.

పోలింగ్ కు విస్తృత ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ కు ఈ నెల 13న ఎన్నికలు జరగనున్నాయి.రాష్ట్రంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ రాష్ట్రంలో 4.14 కోట్ల మంది ఓటర్లున్నారు. ఎన్నికల నిర్వహణకు గాను 46 వేల 389 మంది పోలింగ్ కేంద్రాలను ఏర్పాట్లు చేశారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించి 1.60 లక్షల బ్యాలెట్ యూనిట్లను ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలను సమస్యాత్మక నియోజకవర్గాలుగా అధికారులు గుర్తించారు. ఈ నియోజకవర్గాల్లో భద్రతను మరింత పెంచారు.

ఎన్నికల షెడ్యూల్ విడుదల రోజు నుండి ఇప్పటివరకు సుమారు రూ. 204 కోట్లను సీజ్ చేశారు అధికారులు.ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఎన్నికల బందోబస్తులో 1.14 లక్షల సివిల్ పోలీసులతో పాటు , 58 వేల కంపెనీల పారా మిలటరీ బలగాలు, 465 కంపెనీల సేవలను వినియోగించుకోనున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకొనేలా ఏర్పాట్లు చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు.రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పోలింగ్ ఏర్పాట్లపై ఎన్నికల అధికారులతో ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. అవసరమైన సూచనలు చేశారు.పక్కరాష్ట్రాల నుండి తమ స్వగ్రామాల్లో ఓటు హక్కును వినియోగించుకొనేందుకు వచ్చే ఓటర్లకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టుగా మీనా ప్రకటించారు.

Tags:    

Similar News