చంద్రబాబుకు ఊరట: ఉండవల్లి ఇంటిపై ఆళ్ల ప్రకటన.....

Update: 2019-06-26 11:37 GMT

కోర్టు నిర్ణయం తర్వాతే చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ ఇంటి కూల్చివేతపై నిర్ణయం తీసుకొంటామని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. నిబంధనలకు విరుద్దంగా లింగమనేని రమేష్ ఇంటిని నిర్మించాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయమై గతంలోనే లింగమనేని రమేష్ కోర్టును ఆశ్రయించాడు. అవశేష ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబునాయుడు ప్రమాణం చేసిన తర్వాత ఉండవల్లిలోని లింగమనేని రమేష్ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఈ ఇంటి పక్కనే ప్రజా వేదికను చంద్రబాబు నిర్మంచాడు. సీఎంగా ఉన్న సమయంలో తనను కలిసేందుకు వచ్చే ప్రజా ప్రతినిధులు, ఇతరులతో కలిసేందుకు వీలుగా ఈ నిర్మాణాన్ని చేపట్టారు. 

అయితే ప్రజా వేదిక అన్ని నబంధనలను ఉల్లంఘించి నిర్మించినందున కూల్చివేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రజా వేదిక పక్కనే చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్నారు.నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన భవనంలో చంద్రబాబు నివాసం ఉంటున్నారు... ఈ ఇంటిని ఖాళీ చేస్తారో... ఉంటారో ఆయనే తేల్చుకోవాలని మంత్రి అనిల్ కుమార్ మంగళవారం నాడు కోరారు.

లింగమనేని రమేష్ ఇంటిపై ఇప్పటికే కోర్టులో కేసు ఉంది. ప్రభుత్వం నుండి వచ్చిన నోటీసులపై లింగమనేని రమేష్ కోర్టును ఆశ్రయించాడు. ఈ విషయమై కోర్టు నుండి ఎలాంటి నిర్ణయం వస్తోందోననే అధికార పార్టీ నేతలు ఎదురుచూస్తున్నారు. కోర్టు నిర్ణయం తర్వాతే చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ ఇంటిపై నిర్ణయం తీసుకొంటామని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News