Online Loan Apps: ప్రాణాలు హరిస్తున్న రుణ యాప్‌లు

Online Loan Apps: రుణాల పేరుతో దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లు

Update: 2022-07-16 01:58 GMT

Online Loan Apps: ప్రాణాలు హరిస్తున్న రుణ యాప్‌లు

Online Loan Apps: ఆన్‌లైన్ కాల్ మనీ యాప్‌ల వేధింపులు మరింత తీవ్రతరం అవుతున్నాయి. మధ్యతరగతి ప్రజల అవసరాలు ఆసరాగా చేసుకుని రుణ యాప్‌ల పేరుతో దోచుకుంటున్నారు. రుణాలు తీసుకున్న వారు వేధింపులు భరించలేక తనువులు చాలిస్తున్నారు. గుంటూరు జిల్లాలో రుణ వేధింపులు భరించలేక ఇద్దరు ప్రాణాలు తీసుకోవడం కలకలం రేపింది. రుణ యాప్‌లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఆన్‌లైన్‌ రుణాల పేరిట ఆడవాళ్లను టార్గెట్‌ చేసి దొరికినకాడికి దోచేస్తున్నాయి. గతంలో మాదిరి యాప్‌ నిర్వాహకులు ఫోన్లు చేసి తిట్టడం, ఒత్తిడి చేయడం వంటివి కాకుండా కొత్త పద్ధతుల్లో బాధితులను వెంటాడి, వేటాడి, వేధిస్తున్నారు. ఒకటికి పదింతలు వసూలు చేసినా తృప్తి చెందని ఈ కాలనాగులు బాధితుల వ్యక్తిగత సమాచారం చోరీ చేసి ఆకృత్యాలకు తెగపడుతున్నారు. డెడ్‌లైన్లు పెట్టి మరీ హెచ్చరిస్తున్నారు. అడిగింది ఇవ్వకుంటే బతుకులను బుగ్గి చేస్తున్నారు. ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానీలో వెలుగుచూసింది. సరిగ్గా వారం రోజుల క్రితం అదే ప్రాంతంలోని నవులూరులో చోటు చేసుకుంది. నవులూరుకు చెందిన బీటెక్‌ విద్యార్థిని ఇలానే లోన్‌యాప్‌ ద్వారా లోన్‌ తీసుకుని చెల్లించినా నిర్వాహకుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. గడిచిన వారం రోజుల్లో ఇద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారంటే వీరి వేధింపులు ఏ స్థాయిలో ఉంటాయో అర్ధమవుతోంది.

అప్పట్లో బాధితులను తిట్టడం, వారి ఇళ్ల వద్దకు వచ్చి వేధించడం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడేవారు. కానీ ఇప్పుడు కొత్త పద్ధతుల్లో వేధింపులకు తెర లేపారు. లైంగిక వేధింపుల ద్వారా ఒకటికి పదింతలు వసూలు చేస్తున్నారు. అందుకోసం ప్రధానంగా స్మార్ట్‌ ఫోన్లు వాడే మహిళలను టార్గెట్‌ చేస్తున్నారు. యాప్‌లో లాగిన్‌ అవడానికి ముందే వ్యక్తిగత సమాచారం, లొకేషన్‌ యాక్సెస్‌ తీసుకుంటారు. తద్వారా ఆయా వ్యక్తులు వినియోగించే ఫోన్‌లో ఉన్న సమాచారం మొత్తం చోరీ చేస్తారు. వేలల్లో అప్పులు ఇచ్చి లక్షల్లో వసూలు చేస్తారు. అలా చెల్లించకపోతే ఫోన్‌లో నుంచి కాజేసిన కాంటాక్టు నంబర్లకు మెసేజీలు, నగ్న చిత్రాలు పంపిస్తామని బెదిరిస్తారు. దీంతో ఒత్తిడి భరించలేని మహిళలు ఏళ్ల తరబడి రుణాలు చెల్లిస్తూనే ఉంటారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొన్ని వేల మంది ఆన్‌లైన్‌ కాల్‌మని బారిన పడి నలిగిపోతున్నారు. పరువు పోతుందన్న భయంతో చాలామంది బయటికి చెప్పుకోలేక నరకయాతన అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టకపోతే మరికొంత మంది అమాయకులు బలయిపోయే పరిస్థితి లేకపోలేదు.

Tags:    

Similar News