Coronavirus: కరోనా కాలంలో గర్భిణీలకు అగ్నిపరీక్ష..!

Coronavirus: ఎప్పుడు, ఏ వైపు నుంచి మహమ్మారి దాడి చేస్తుందోనని ఆందోళన

Update: 2021-06-11 07:54 GMT

pregnant women(Thehansindia)

Coronavirus: కరోనా కష్ట కాలం గర్భిణులకు అగ్ని పరీక్షల మారింది. ఓవైపు కడుపులోని బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. మరోవైపు వైరస్‌ను నిలువరించాలి. ఎప్పుడు, ఏ వైపు నుంచి మహమ్మారి దాడి చేస్తుందో అన్న భయం వెంటాడుతూ ఉంటుంది. ఇదే సమయంలో ప్రసవ సమయంలో గర్భిణులను ప్రైవేట్‌ ఆస్పత్రులు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అసలు ఆస్పత్రుల్లో గర్భిణులకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి? వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు?

కరోనా మహమ్మారి కాబోయే అమ్మలపైనా కనికరం చూపటం లేదు. డెలివరీ సమయంలో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. గుంటూరు జిల్లాలో గర్భిణీ మహిళలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో గుంటూరులోని ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్తున్నారు. అయితే అక్కడ కరోనా పేరు చెప్పి.. సాధారణ కాన్పుకు ప్రయత్నించకుండానే సీజేరియన్‌ చేస్తూ లక్షలు గుంజుతున్నారు. బాపట్ల, మాచర్ల, చిలకలూరిపేట వంటి ప్రాంతాల్లోనూ భారీగా వసూలు చేస్తున్నారు. ఇక గుంటూరు, తెనాలి ప్రాంతాల్లో అయితే లక్షలు చెల్లించాల్సిందే...

సాధారణ కాన్పు జరిగే అవకాశం ఉన్నా... శస్త్రచికిత్స ద్వారా కాన్పు చేసేందుకే ప్రైవేట్‌ ఆస్పత్రులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయి. కాసుల కోసం బాధితులను భయాందోళనకు గురిచేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. కాబోయే తల్లి ఏ దిగులు లేకుండా ప్రశాంతంగా ఉండాలని... అప్పుడే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడని వైద్యులు చెబుతున్నారు. కరోనా గురించి ఆందోళన పడొద్దని, తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు. మొత్తంగా గర్భిణులకు అడుగడుగునా కరోనా భయం వెంటాడుతోంది. వైద్య పరీక్షల కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లే క్రమంలో తనకు ఎక్కడ వైరస్‌ సోకుతుందోనని భయపడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags:    

Similar News