ఏపీలో కరోనా హెల్త్ బులెటిన్.. ఆ జిల్లాలోనే 17 కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ఉద్ధృతి పెరుగుతుంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 400 దాటింది.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ఉద్ధృతి పెరుగుతుంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 400 దాటింది. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య 405కు చేరుకుంది. శనివారం ఒక్కరోజే కొత్తగా రాష్ట్రంలో 24 మందికి కరోనా సోకినట్టు పరీక్షల్లో తేలింది. ఇవాళ అత్యధికంగా గుంటూరు జిల్లాలో 17, కర్నూలు జిల్లాలో 5, కడప, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటవరకూ 11 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఆరుగురు మరణించారు. 388 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తాజా కేసులతో గుంటూరు జిల్లాలో 74 మంది కరోనా బారిన పడ్డారు. కోవిడ్ 19 బారిన పడి జిల్లాలో ఒక వ్యక్తి మరణిచాగా... దాచేపల్లి మండలం నారాయణపురానికి చెందిన మరో వ్యక్తి మృతి చెందాడు. శనివారం నమోదైన పాజిటివ్ కేసుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. కరోనా వైరస్ సోకిన వారి భారీగా పెరిగింది. ఒక్క గుంటూరు నగరంలోనే 53 మందికి పాజిటివ్ కేసులు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గుంటూరులో ఒకే కుటుంబంలో 10 మందికి కరోనా వైరస్ సోకింది.
కరోనా కేసులు పెరుగుతుండడంతో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. ఈనేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్ మాట్లాడుతూ.. ఆదివారం జిల్లాను పూర్తిగా లాక్‌డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం చికెన్, మటన్ షాపులు ఉండవని స్పష్టం చేశారు. రేపటి నుంచి రోజు విడిచి రోజు నిత్యావసరాల కోసం అవకాశం ఇస్తామని తెలిపారు. అనవసరంగా రోడ్లపై తిరిగే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని శ్యామ్యూల్ ఆనంద్ స్పష్టం చేశారు.
జిల్లాల వారిగా పాజిటివ్ కేసులు చూస్తే:
♦ గుంటూరు(74),
♦ కర్నూలు(82),
♦ నెల్లూరు(48),
♦ కృష్ణ జిల్లాలో( 35),
♦ ప్రకాశం జిల్లా (41),
♦ తూర్పు గోదావరి ( 17),
♦ పశ్చిమ గోదావరి ( 22),
♦ విశాఖపట్నం(20),
♦ చిత్తూరు(20),
పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతానికి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు కోవిడ్ ఫ్రీ జిల్లాలుగా ఉన్నాయి.