Corona Patient: తిరుపతి రుయాలో కోవిడ్‌ పేషెంట్‌ మిస్సింగ్

Corona Patient: కోవిడ్‌ సోకిందని ఆస్పత్రిలో జాయిన్‌ అయిన మనిషే మిస్‌ అయిన ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగుచూసింది.

Update: 2021-05-10 06:37 GMT

Corona Patient: తిరుపతి రుయాలో కోవిడ్‌ పేషెంట్‌ మిస్సింగ్

Corona Patient: కోవిడ్‌ సోకిందని ఆస్పత్రిలో జాయిన్‌ అయిన మనిషే మిస్‌ అయిన ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగుచూసింది. పేషెంట్‌ను రుయా కోవిడ్‌ ఆస్పత్రిలో చేర్చామని అంబులెన్స్‌ సిబ్బంది చెప్తుండగా మాకేం తెలీదని ఆస్పత్రి సిబ్బంది బొంకుతున్న అయోమయ పరిస్థితులు రుయా ఆస్పత్రిలో చోటుచేసుకున్నాయి. 5రోజులు గడిచినా బాధితుడి ఆచూకీ లభించలేదు. అసలు ఉన్నాడో.. లేడో.. అనే విషయాన్ని చెప్పే నాథుడు కూడా కరువయ్యాడు. దీంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.

చిత్తూరు జిల్లాలో దారుణం వెలుగుచూసింది. కార్వేటి నగరం మండలం ఎర్రమరాజుపల్లికి చెందిన గోవిందయ్యకు ఈ నెల 3న కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. పరిస్థితి విషమంగా ఉండటంతో 108 సహాయంతో తిరుపతి రుయా కోవిడ్‌ ఆస్పత్రికి తరలించారు. మరుసటిరోజు ఉదయం నుంచి గోవిందయ్య సెల్‌‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో ఏం జరిగిందో తెలియక అయోమయ పరిస్థితుల్లో రుయా కోవిడ్‌ ఆస్పత్రికి వచ్చారు భార్య, పిల్లలు.

గోవిందయ్య ఆచూకీ కోసం అక్కడి అధికారులను అడుగుదామంటే సమాధానం చెప్పే నాథుడే కరవయ్యాడు. రుయా సిబ్బందిని ప్రశ్నిస్తే.. మీ వాళ్లెక్కడున్నారో మాకేం తెలుసని నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. దీంతో తన తండ్రి కనిపిస్తాడేమోనన్న ఆశతో ఆస్పత్రి కిటికీలన్నింటిలోంచి లోపల చూశారు. కానీ, ఎక్కడా కనబడలేదు. 5రోజులైనప్పటికీ గోవిందయ్యకు సంబంధించి ఎలాంటి ఆచూకీ దొరకలేదు. అసలు బతికున్నాడా..? లేదా..? చెప్పండని సిబ్బందిని నిలదీసినప్పటికీ.. వారి మొర ఎవరూ ఆలకించలేదు. వారి కళ్ల ముందు నుంచి మృతదేహాలు వెళ్తుంటే.. గోవిందయ్యే అని భావించి.. దగ్గరకు పరుగెత్తుకుని వెళ్లి చూసే పరిస్థితులు వచ్చాయి.

ఇక.. ఇలా కాదని అనుకున్న బాధిత కుటుంబం.. పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కింది. జరిగిందంతా చెప్పింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు కుటుంబీకులు. తమ తండ్రి ఆచూకీ కనిపెట్టాలని పోలీసులను కోరారు.

Tags:    

Similar News