Gulab Cyclone: గులాబ్ తుఫాన్‌తో మొక్కజొన్న రైతు కుదేలు

* 26 మండలాల్లో మొక్కజొన్న పంట వేసిన రైతులు * శ్రీకాకుళం జిల్లాలోని 12 మండలాలపై భారీ ఎఫెక్ట్

Update: 2021-09-30 02:46 GMT

మొక్కజొన్న రైతు కుదేలు (ఫైల్ ఫోటో)

Gulab Cyclone: ఆరుగాలం కష్టపడి పండించిన పంట నేలపాలవ్వడంతో రైతు కుదేలయ్యాడు. గులాబ్ తుఫాను వల్ల శ్రీకాకుళం జిల్లాలో 12 మండలాలలో సృష్టించిన బీభత్సానికి మొక్కజొన్న రైతు కన్నీరుమున్నీరవుతున్నాడు. జిల్లాలో ఈసారి 50 వేల హెక్టార్లలో మొక్కజొన్న పంట వేశారు. ప్రతీసారి మొక్కజొన్న వల్ల లాభాలు గడిస్తున్న రైతన్నకు ఈ తుఫాను కారణంగా ఢీలా పడ్డాడు.

ఎకరాకు 20 వేల నుండి 30 వేల వరకూ ఖర్చుపెడుతున్న రైతుకు చేతికి చిల్లిగవ్వ రాని విధంగా పంట నష్టం రావడంతో ప్రభుత్వం ఆదుకుంటుందని ఆశగా ఎదురు చూస్తున్నాడు. జిల్లాలో 38 మండలాలకు గాను 26 మండలాల్లో మొక్కజొన్న వేశారు రైతులు. ఆమదాలవలస, రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల, జి.సిగడాం, సరు బుజ్జిలి, పొందూరు, శ్రీకాకుళం రూరల్, గార, పోలాకి, నరసన్నపేట, బూర్జ మండలాలలో మొక్కజొన్న నీట మునిగింది. ఏ ఒక్క అధికారి ఇప్పటి వరకూ రాలేదని, తమను పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు.

గులాబ్ తుఫాను వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో అధికారులు పర్యటించి ఎంత నష్టం అనేది చూడాల్సిన బాధ్యత ఉందని రైతులు కోరుతున్నారు. నష్టపోయిన తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వ్యవసాయ ఆధారిత జిల్లా కనుక అధికారులు సకాలంలో స్పందించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News