Andhra Pradesh: పశువులకు అంబులెన్స్‌ సర్వీసులను ప్రారంభించిన సీఎం జగన్‌

Andhra Pradesh: తొలి విడతలో నియోజకవర్గానికి ఒక్కో వాహనం రూ.143 కోట్లతో 175 పశువుల అంబులెన్స్‌ల కొనుగోలు

Update: 2022-05-20 01:55 GMT

Andhra Pradesh: పశువులకు అంబులెన్స్‌ సర్వీసులను ప్రారంభించిన సీఎం జగన్‌

Andhra Pradesh: మనుషుల కోసం అంబులెన్స్ లు ఉన్నట్లే ఇక పశువులకూ అంబులెన్స్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పశువులకు ఆరోగ్య సేవలందించే అంబులెన్స్ వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. పాడి రైతులు 1962 నెంబర్ కు ఫోన్ చేస్తే చాలు అంబులెన్సుల ద్వారా సేవలందించే ఏర్పాట్లు చేశారు.

పశువులకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఈ వాహనాలను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. పశుసంవర్థక , మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, ఉన్నతాధికారులు, నేతలు పాల్గొన్నారు. మొదటి విడతలో 143 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 175 పశువుల అంబులెన్స్‌లు ఆయా ప్రాంతాలకు వెళ్లాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 278 కోట్ల వ్యయంతో మొత్తం 340 పశువుల అంబులెన్స్‌ల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రెండో దశలో 135 కోట్ల వ్యయంతో త్వరలో మిగిలిన 165 పశువుల అంబులెన్స్‌లు కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసం రెండు ప్రవేశపెట్టాలని నిర్ణయించగా.. ప్రస్తుతానికి నియోజక వర్గానికి ఒక వాహనాన్ని కేటాయించారు.

అత్యాధునిక సౌకర్యాలతో కూడిన డాక్టర్‌ వైఎస్సార్‌ సంచార పశువుల అంబులెన్స్ లో ఒక పశు వైద్యుడు, వెటర్నరీ డిప్లొమా చేసిన సహాయకుడు, డ్రైవర్‌ కమ్‌ అటెండర్‌ ఉంటారు. 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్తపరీక్షలు చేసేందుకు వీలుగా మైక్రోస్కోప్‌తో కూడిన చిన్న ప్రయోగశాల, అన్ని రకాల వ్యాక్సిన్లు, మందులతో పాటు పశువును వాహనంలోకి ఎక్కించేందుకు హైడ్రాలిక్‌ సౌకర్యం ఉండేలా ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ సీఎం జగన్ పరిశీలించారు.

ప్రాధమిక వైద్య సేవలతో పాటు సన్న జీవాలు, పెంపుడు జంతువులు, పక్షులకు సర్జరీలు చేసేందుకు వీలుగా వాహనాల రూపకల్పన చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అవసరమైతే హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ సౌకర్యంతో పశువును వాహనంలోకి ఎక్కించి శస్త్రచికిత్సను చేసే సౌలభ్యం కల్పించినట్లు తెలిపారు.అవసరమైన పరిస్ధితులలో దగ్గరలోని ఏరియా పశువైద్యశాలకు లేదా వెటర్నరీ పాలిక్లీనిక్‌లకు తరలించి పశువుకు సరైన వైద్యం అందించి ప్రాణాపాయం నుండి రక్షించడం జరుగుతుంది. వైద్యం అందించిన అనంతరం ఆ పశువును రైతు ఇంటికి ఉచితంగా చేర్చే ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మూగజీవాలు తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1962 కు ఫోన్‌ చేసి రైతు పేరు, గ్రామం, మండలం, పశువు అనారోగ్య సమస్య వివరించిన వెంటనే సంబంధిత రైతు భరోసా కేంద్రానికి సమాచారం చేరుతుంది. ఆ వెంటనే పశువుల అంబులెన్స్‌లు పశువు ఉన్న ప్రాంతానికి వెళ్ళి వైద్యసేవలు అందిస్తాయని ప్రభుత్వం తెలిపింది. 108 అంబులెన్స్‌ సేవల తరహాలోనే పశువుల అంబులెన్స్‌ సేవలు అందిస్తాయని తెలిపారు.ఈ అంబులెన్స్‌ల మెయిన్‌టెనెన్స్‌ ఖర్చు ప్రభుత్వమే భరిస్తూ నాణ్యమైన సేవలు అందించనుంది. మారుమూల ప్రాంతాల్లో సైతం రైతులకు కచ్చితమైన, నాణ్యమైన పశు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

Tags:    

Similar News