సీఎం జగన్‌ స్పీడ్‌కు తగ్గట్టుగా పనిచేయని మంత్రులు

Update: 2019-08-10 05:51 GMT

రాజ్యం బాగుండాలంటే రాజు మాత్రమే కాదు మంత్రులు కూడా సక్రమంగా పనిచేయాలి. కానీ, ఏపీ సర్కార్‌లో మాత్రం రాజు తప్ప మంత్రులెవరూ పనిచేయడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం జగన్ అంచనాలు ఒకలా ఉంటే మంత్రుల పనితీరు మాత్రం మరొకలా ఉంటుంది. దీంతో జగన్ స్పీడ్‌కు తగ్గట్టుగా మంత్రులు అందుకోలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

నవరత్నాలను ప్రజలకు సక్రమంగా అందిస్తామంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ హామీని నిలబెట్టుకునేందుకు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంది. దీనికి సంబంధించి అనేక బిల్లులను రూపొందించి వాటికి చట్టబద్ధత కల్పించింది. వీటి అమలు కోసం సీఎం జగన్ ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే, జగన్‌ స్పీడ్‌కు తగ్గట్టుగా మంత్రులు పనిచేయలేకపోతున్నారన్న భావన ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమవుతోంది.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లే విషయంలో మంత్రులు విఫలమవుతున్నారు. గత ప్రభుత్వం కంటే తామేమీ చేస్తున్నామన్న విషయాన్ని ప్రజలకు వివరించడంలో మంత్రులు వెనుకబడిపోతున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు, వాటిని తీసుకోవడానికి గల కారణాలను ప్రజలకు వివరించలేకపోతున్నారు. ఇటీవల మహిళా బిల్లు, 50శాతం రిజర్వేషన్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించిన బిల్లు ఇలా ఒకటి కాదు, రెండు కాదు 19 బిల్లులను ప్రజారంజకంగా ఆమోదింప చేసుకుంది జగన్ సర్కార్. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రుల అస్పష్టత పూర్తిగా కనిపిస్తోంది.

అలాగే, పథకాల సంగతి పక్కన పెడితే కనీసం ప్రతిపక్షం విమర్శలను తిప్పికొట్టేందుకు కూడా మంత్రులు సాహసించని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కీలక పరిస్థితుల్లో మంత్రులు సక్రమంగా వ్యవహరించడం లేదు. తాజాగా గోదావరి వరదల విషయంలో ముంపు గ్రామాల ప్రజలను ఆదుకోవడంలో మంత్రులు పూర్తిగా విఫలమయ్యారు. ఇదే విషయంపై రాజమండ్రిలో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ మంత్రులకు క్లాస్ పీకినట్టు తెలుస్తోంది.

సీఎం జగన్ వేగంగా తీసుకుంటున్న నిర్ణయాలను మంత్రులు వేగంగా రిసీవ్ చేసుకోవడం లేదన్నది స్పష్టమవుతోంది. మంత్రులు ఇలాగే వ్యవహరిస్తే ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరిగే అవకాశం కనిపిస్తోంది. మరి సీఎం జగన్ తన మంత్రులను ఎలా స్పీడప్ చేస్తారో చూడాలి.

Full View 

Tags:    

Similar News