సస్పెండైన ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌పై సీఐడి కేసు నమోదు

Update: 2019-12-16 05:06 GMT

ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ‌కిశోర్‌పై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేశారని ఆయనపై ఆదివారం రాత్రి సీఐడీ అధికారులు పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి (ఏపీఈడీబీ) సీఈవోగా పనిచేసిన కృష్ణ‌కిశోర్‌ నేరపూరిత నమ్మకద్రోహానికి పాల్పడ్డారన్న అభియోగాన్ని నమోదు చేశారు. కొద్దిరోజులుగా ఏపీ ఆర్థికాభివృద్ధి మండలి చట్టాన్ని కృష్ణకిశోర్ ఉల్లంఘించి అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పరిశ్రమలు, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ అతనిపై నివేదికను తయారు చేసింది. దాంతో ఇటీవల కృష్ణకిశోర్‌ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కృష్ణకిశోర్‌తోపాటు పే అండ్‌ అకౌంట్స్‌ విభాగానికి చెందిన అకౌంట్స్‌ అధికారి శ్రీనివాసరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. తాజాగా ఆయనపై సీఐడీ కేసు నమోదు చేశారు.. దర్యాప్తు ముగిసే వరకు అమరావతి విడిచి వెళ్లోద్దని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.

Tags:    

Similar News