విధుల్లో ఉద్యోగుల నిర్లక్ష్యం.. షాకిచ్చిన చిత్తూరు కలెక్టర్
Chittoor Collector: విధి నిర్వహణలో అలసత్వం..ఐదు మండలాల ఉద్యోగుల జీతాలు నిలుపుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Chittoor Collector Harinarayan:(File Image)
Chittoor Collector: చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 5 మండలాల ఉద్యోగుల జీతాలు నిలుపుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని పెదమండ్యం, తవణంపల్లె, శ్రీకాళహస్తి, సత్యవేడు, మదనపల్లె మండలాల్లోని రెవెన్యూ, పంచాయతీరాజ్, హెల్త్, సచివాలయం, మున్సిపల్ శాఖల ఉద్యోగుల నెలవారీ జీతాలను నిలిపివేస్తున్నట్లు హరినారాయణన్ వెల్లడించారు.
ఆయా మండలాల పరిధిలో ఆరో విడత ఫీవర్ సర్వేలో పలు శాఖల అధికారులు నిర్లక్ష్యం వహించారని హరినారాయణన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారందరిపై విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆదేశాలను బేఖాతరు చేసిన వారిపైనా ఇదే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటానంటూ తీవ్రంగా హెచ్చరించారు. వారందరికీ.. జీతాలు నిలిపివేయాలని జిల్లా ట్రెజరీని ఆదేశించారు. ఇంకా ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవంటూ సూచనలు చేశారు. ఇలా ప్రతి శాఖలో అధికారులు విధులు సక్రమంగా నిర్వహించని వారిపై చర్యలు తీసుకుంటే ప్రజలకు వెసులుబాటు కలుగుతుందని అందరూ భావిస్తున్నారు.