AP Bird Flu: తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. కోళ్లు చనిపోవడానికి ఏవియన్ ఇన్ ఫ్లయోంజా వైరస్ కారణమని తేలింది. పలు ప్రాంతాల్లో మరణించిన కోళ్ల నుంచి తీసిన నమూనాలను మధ్య ప్రదేశ్ లోని భోపాల్ లో ఉన్న నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హైసెక్యూరిటీ యానిమల్ డీసీజెస్ కు పంపించారు. అందులో తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు ఆగ్రహారం, పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో ఫారాల నుంచి పంపిన రెండు శాంపిల్స్ పాజిటివ్ గా నిర్ధారించారు.
దీంతో పశుసంవర్ధకశాఖ అధికారులు ఆ రెండు కోళ్ల ఫారాల్లో కోళ్లను పూడ్చిపెట్టడంతోపాటు కిలోమీటర్ వరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. పరిసర ప్రాంతాల్లోనూ వైరస్ నియంత్రణకు చర్యలు చేపట్టారు. రెడ్ జోన్ లో 10 బృందాలు,సర్వేలైన్స్ జోన్ లో 10 బృందాలతో నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఫారాల్లో పనిచేస్తున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. కోళ్ల వ్యాధులపై అన్నదాతలకు అవగాహన సదస్సులను కూడా నిర్వహిస్తున్నారు.
పలు దేశాల నుంచి వచ్చే వలస పక్షుల్లో ఉండే వైరస్ వాటి రెట్టల ద్వారా జలాశయాల్లోకి చేరుతోంది. అక్కడి నుంచి నీరు, ఇతర మార్గాల్లో కోళ్లకు సంక్రమిస్తోంది. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటంతో కొన్నిచోట్ల వైరస్ ప్రభావం కనిపిస్తోంది. అక్కడ చనిపోయిన వాటిని పూడ్చి పెట్టకుండా బయటపడేందుకు కోళ్లఫారాలకు చేరుకుంది. ఉష్ణోగ్రతలు 32నుంచి 34 డిగ్రీల మధ్య ఉంటే ఈ వైరస్ జీవించలేదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలోని అధికశాతం ప్రాంతాల్లో 34డిగ్రీలపైనే నమోదు అవుతుందని చెబుతున్నారు.
మాంసం, గుడ్లు తీసుకున్నా ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని గన్నవరం ఎన్టీఆర్ పశువైద్య కళాశాల పౌల్ట్రీ సైన్స్ విభాగాధిపతి నరేంద్ర తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలో ఈ వైరస్ బతకలేదని తెలిపారు. కోడిమాంసం, గుడ్లను 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికిస్తామని అప్పుడు అందులో ఎలాంటి వైరస్ ప్రభావం ఉండదని తెలిపారు.