కరోనాతో పాటు ఇతర ప‌రీక్ష‌లకు మొబైల్ ల్యాబ్ : కేంద్రం, ఏపీలు సంయుక్తంగా ఏర్పాటు

ప్రస్తుతం వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలంటే వీలైనంత వరకు టెస్టులు చేయాలి.

Update: 2020-06-20 03:29 GMT

ప్రస్తుతం వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలంటే వీలైనంత వరకు టెస్టులు చేయాలి. ఎక్కువ శాతం టెస్టులు చేయడం వల్ల కరోనా వ్యాప్తిని కనిపెట్టవచ్చు. దీనిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడికక్కడ ల్యాబ్ లు ఏర్పాటు చేశారు. అయితే ఇవి సుదూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అందుబాటులో లేవు. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వాలు తాజాగా కరోనాతో పాటు ఇతర వ్యాధులకు సంబంధించి టెస్టులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశాయి. ప్రత్యేకంగా మొబైల్ వ్యాన్ లో వీటికి అవసరమైన పరికరాలను ఏర్పాటు చేసి, మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు అందుబాటులో ఉంచింది.

దేశంలో క‌రోనా వైర‌స్ ప‌రీక్ష‌ సంఖ్య‌ల‌ పెంపు, సుదూర ప్రాంతాల‌కు ఆ సదుపాయాలు క‌ల్పించే ఉద్దేశ్యంతో కేంద్రం మొట్ట‌మొద‌టి మొబైల్ ప్ర‌యోగ‌శాల‌ను ప్రారంభించింది. ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్ష వర్ధన్ జెండా ఊపి ఈ వాహనాన్ని ప్రారంభించారు . అత్యంత సులువుగా గూడ్స్ రైలు పైకి ఎక్కించి.. దేశంలోని ఏ ప్రాంతానికైనా పంపించేలా ఈ ల్యాబ్‌ను రూపొందించారు.

సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్‌లోని మెడ్‌టెక్ జోన్ సంయుక్తంగా ఈ మొబైల్ ల్యాబ్‌ను రూపొందించాయి. కేవ‌లం 8 రోజుల వ్య‌వ‌ధిలో దీన్ని త‌యారు చేశాయి. క‌రోనా ఒక్క‌టే కాకుండా క్ష‌య‌, హెచ్ఐవీ వంటి ఇత‌ర వ్యాధుల‌కు సంబంధించిన ప‌రీక్ష‌లు కూడా ఈ ల్యాబ్‌లో నిర్వ‌హించొచ్చు.

రోజుకు 50 కరోనా పరీక్షలతో పాటు.. 200 ఇతర వ్యాధుల‌ను సంబంధించిన‌ పరీక్షలను నిర్వహించే సామ‌ర్థ్యం ఈ మొబైల్ ల్యాబ్‌కు ఉంది. ఒక వేళ మెషిన్ల సంఖ్య‌ను రెట్టింపు చేయ‌గ‌లిగితే.. రోజుకు 500 టెస్టుల వ‌ర‌కు నిర్వ‌హించొచ్చు. త్వ‌ర‌లోనే మ‌రో 50 మొబైల్ ల్యాబ్‌ల‌ను త‌యారు చేసి దేశ న‌లుమూల‌ల‌కు పంపిస్తామ‌ని కేంద్రం ఆరోగ్య‌శాఖ మంత్రి చెప్పారు.


Tags:    

Similar News