Andhra Pradesh: మాజీ సీఎం చంద్రబాబు పై మరో రెండు కేసులు

Andhra Pradesh: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై కేసుల పరంపర కొనసాగుతూనే వుంది.

Update: 2021-05-12 04:30 GMT

Ex-CM Chandrababu Naidu:(File Image)

Andhra Pradesh: రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించి ప్రజలు అల్లాడుతుంటే మరో వైపు అధికార, ప్రతిపక్షాలు ఒకరి పై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై కేసుల పరంపర కొనసాగుతూనే వుంది. కర్నూలు జిల్లాలో ప్రమాదకరమైన ఎన్440కె రకం వేరియంట్ వెలుగుచూసిందని, ఇది సాధారణ వైరస్ కంటే 10-15 రెట్లు ఎక్కువ ప్రభావం చూపిస్తుందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహితమైనవని, ప్రజల్లో మానసిక వేదన, అధైర్యం కల్పించాయని పేర్కొంటూ, జిల్లా కోర్టు న్యాయవాది పచ్చల అనిల్ కుమార్ చేసిన ఫిర్యాదు మేరకు గుంటూరులోని అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో నిన్న కేసు నమోదైంది.

నరసరావుపేటలోనూ చంద్రబాబుపై మరో కేసు నమోదైంది. ఇది కూడా కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఫిర్యాదుతోనే కావడం గమనార్హం. చంద్రబాబు, ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు కలిసి కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పట్టణానికి చెందిన న్యాయవాది రాపోలు శ్రీనివాసరావు చేసిన ఫిర్యాదుపై నిన్న నేతలిద్దరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా, ఇలాంటి ఆరోపణలతోనే ఇటీవల కర్నూలులో చంద్రబాబుపై కేసు నమోదైన విషయం తెలిసిందే.

కరోనా వైరస్ వేరియంట్ ఎన్-440కే వైరస్ కర్నూలు పుట్టిందంటూ చంద్రబాబు చేసిన కామెంట్స్ కు కౌంటర్ గా ఈనెల 8న మీడియాతో మాట్లాడిన కొడాలి నాని.. కరోనా లాంటి వైరస్ ఏమైనా పుడితే గిడితే.. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో పుట్టింది. దాని పేరు నారా కరోనా. సీబీఎన్ 420. 70 ఏళ్ళ క్రితమే అక్కడ పుట్టి, రాష్ట్రాన్ని నాశనం చేయటానికి నారా 420 వైరస్ పనిచేస్తుందని ఎద్దేవా చేశారు. వాస్తవానికి, చంద్రబాబుకు వేయాల్సింది కరోనా వ్యాక్సిన్ కాదు.. రాబిస్ వ్యాక్సిన్ వేయించాలని ఘాటుగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలపైనే టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇలా ఒకరి పై మరొకరు కేసులు పెట్టుకుంటూ అసలు విషయాన్ని గాలికి వదిలేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News