వైసీపీ వివాదాస్పద ఫ్లెక్సీపై కేసు నమోదు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం రామసింగవరంలో వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది.
ఏలూరు : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం రామసింగవరంలో వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీనిపై వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులు వైసీపీకి చెందిన పలువురిపై కేసు నమోదు చేశారు.
ద్వారకాతిరుమల మండలం రామసింగవరంలో మాజీ సీఎం వైఎస్ జగన్ బర్త్‌డే సందర్భంగా వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ‘‘2029లో 88 మ్యాజిక్ ఫిగర్ దాటగానే గంగమ్మ జాతరలో వేట తలలు నరికట్టు రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని’ అని ఫ్లెక్సీపై రాశారు.
ఫ్లెక్సీపై వ్యాఖ్య వల్ల గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఫ్లెక్సీని తీసివేయాలని స్థానికులు కోరగా, వైసీపీ నేతలు ఫ్లెక్సీలను తీయకపోవడమే కాకుండా బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. వైసీపీకి చెందిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు గ్రామంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.