హెరిటేజ్‌లో 25 రూపాయలకు ఉల్లిపాయలు అమ్మగలరా? చంద్రబాబు కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూటి ప్రశ్న!

ఉల్లి ధరలపై ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును ఎద్దేవా చేశారు.

Update: 2019-12-09 08:10 GMT
జగన్‌

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. తొలిరోజే సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. సమావేశాల్లో పదే పదే ఉల్లి ధరల పై చర్చించాలంటూ ప్రతిపక్ష టీడీపీ సభ్యులు సమావేశాలకు అడ్డుతగిలారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డే కల్పించుకుని ఉల్లి ధరలపై ప్రభుత్వం చేసుకుంటున్న చర్యలపై వివరించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మీ హెరిటేజి దుకాణాల్లో ఉల్లి పాయలను కేజీ 25 రూపాయలకు అమ్మగలరా అని నిలదీశారు.

దేశమంతా ఉల్లి ధరలతో తల్లడిల్లుతుంటే ఏపీలో కిలో ఉల్లి 25 రూపాయలకే అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. రాష్ట్రంలో ఉల్లి అందుబాటులో లేకపోతే పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తూ ప్రజలకు అందిస్తున్నామని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉల్లి ధరల అంశంపై సీఎం జగన్‌ స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటిదాకా 36,500 క్వింటాళ్ల ఉల్లి కొనుగోలు చేసి రైతు బజార్లలో కేజీ కేవలం రూ.25లకు అమ్ముతున్నట్లు తెలిపారు.

చంద్రబాబు హయాంలో ఉల్లి పంట రైతులకు గిట్టబాటు ధరలేక పొలాల్లోనే వదిలేసిన పరిస్థితి చూశామన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక, ప్రస్తుతం రైతులకు మంచి రేటు వస్తోందని.. వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని జగన్ తెలిపారు. ప్రభుత్వం కల్పించుకొని కేజీ రూ.25కు ఇస్తున్నామని చంద్రబాబు హెరిటేజ్‌ షాపులో కేజీ రూ.200 అమ్ముతున్నారని ఎద్దేవా చేశారు. మీరు మీ హెరిటేజ్ లో ఉల్లి కేజీ 25 రూపాయలకు అమ్మగలరా అని సూటిగా చంద్రబాబును ప్రశ్నించారు.

వీళ్లు ఉల్లి ధరల గురించి దిగజారి పోయి మాట్లాడుతున్నారని న్యాయం, ధర్మం ఉందా అంటూ మండిపడ్డారు. మహిళల భద్రతపై జరుగుతున్న చర్చను ఇలా అడ్డుకోవడం సరికాదన్నారు.

Tags:    

Similar News