పులివెందుల సతీష్ రెడ్డి వైసీపీలో చేరతారంటూ ప్రచారం..

Update: 2019-12-11 01:08 GMT

ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి.. రాష్ట్రంలో పరిచయం అక్కర్లేని పేరు. పులివెందులలో టీడీపీకి ఉన్నంతలో బలమైన నేత. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో తలపడుతున్నారు. ఎప్పటికైనా పులివెందుల ఎమ్మెల్యే కావాలని ఆయన కోరిక. కానీ ఆ ముచ్చట తీరడం లేదు. దానికి కారణం పులివెందులలో వైఎస్ కుటుంబ ఆధిపత్యమే. పులివెందుల ప్రజలు నమ్మితే ప్రాణమిస్తారు.. ఆ నమ్మకమే నాలుగు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబాన్ని రాజకీయ అందలం ఎక్కించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతిలో రెండుసార్లు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతిలో రెండుసార్లు సతీష్ రెడ్డి ఓటమి చెందారు. ఓడిపోయినా పులివెందులలో బలమైన నేత కావాలి కాబట్టి సతీష్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది టీడీపీ. అంతేకాదు మండలి చైర్మన్ ను చేసింది. అటువంటి నేత ఇప్పుడు పార్టీ మారుతారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సతీష్ రెడ్డిని వైసీపీ నేతలు సంప్రదిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీలో చేరితే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇస్తున్నారట. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సతీష్ రెడ్డిని చేర్చుకుంటే వేముల, చక్రాయపేట మండలాల్లో మరింత పట్టు సాధించవచ్చని వైసీపీ భావిస్తోందట. ఈ నేపథ్యంలోనే సతీష్ రెడ్డిని చేర్చుకోవాలని వైసీపీ జిల్లా నాయకత్వం భావిస్తోందట. అయితే సతీష్ రెడ్డి మాత్రం టీడీపీని వీడేందుకు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. టీడీపీ తనకు అన్నివిధాలా తోడుగా ఉంటూ వస్తోందని.. ఒకవేళ వైసీపీలో చేరితే టికెట్ ఎలాగూ రాదు.. దానికి తోడు గుర్తింపు కూడా ఉండదని ఆయన అభిప్రాయపడుతున్నారట. దాంతో వైసీపీ ఆఫర్ ను తిరష్కరించారని కూడా ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News