అందరినీ ఆకట్టుకున్న ఆవుదూడ బారసాల

Andhra Pradesh: *కాకినాడ జిల్లా రమణయ్యపేలో ఘనంగా బారసాల

Update: 2022-06-17 03:18 GMT

అందరినీ ఆకట్టుకున్న ఆవుదూడ బారసాల

Andhra Pradesh: సాధారణంగా మన ఇంట చిన్న పిల్లలకు 21 రోజుల తర్వాత బారసాల వేడుక నిర్వహిస్తాం. కుటుంబసభ్యులు, బంధువుల మధ్య బారసాల వేడుక ఘనంగా నిర్వహించుకుంటాం. అయితే తాజాగా ఓ గోమాతకు బారసాల నిర్వహించారు. కాకినాడ జిల్లాలో ఈ వినూత్న ఘటన జరిగింది. కాకినాడ జిల్లా రమణయ్యపేటలో వైద్యుడు గౌరీశేఖర్‌ ఆవుదూడకు బారసాల మహోత్సవాన్ని నిర్వహించారు. ఆయన భార్య రమాదేవి, ఇద్దరు కుమార్తెలు వైద్యులుగానే స్థిరపడ్డారు. అల్లుళ్లు కూడా వైద్యులే. ఇంటిలోనే ఆస్పత్రిని నిర్వహిస్తున్న గౌరీశేఖర్‌కు చిన్నప్పటి నుంచి ఆవులంటే మక్కువ ఎక్కువ. ఇటీవల పుంగనూరు జాతి ఆవుదూడను కొన్నారు. దానికి మూడో నెల రావడంతో బంధుమిత్రులందరినీ పిలిచి బారసాల వేడుకగా నిర్వహించారు.

ఆవుదూడకు పట్టీలు అలంకరించి పూజలు అనంతరం ఊయలలో ఉంచి ఊపుతూ మంత్రోచ్చరణ చేయించి, ఆశీర్వచనలు ఇచ్చారు. పండితుల మంత్రోచ్ఛరణల నడుమ అత్యంత సంప్రదాయంగా, శాస్త్రోక్తంగా లేగదూడకు సారణగా నామకరణం చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊయల ముందు లేగదూడను ఉంచి ఘనంగా బారసాల మహోత్సవాన్ని నిర్వహించారు. బంధువులు, ఆత్మీయులను ఆహ్వానించి సంప్రదాయ విందు భోజనం ఏర్పాటు చేశారు.

 గోవులను పూజిస్తే ప్రకృతికి దగ్గరగా జీవిస్తున్నట్లు అవుతుందన్నారు డాక్టర్‌ గౌరీశేఖర్‌. ఆవుపేడ, గో మూత్రం ద్వారా భూమి ఎంతో సారంగా మారడంతో పాటు గోమూత్రంతో అనేక రకాల అనారోగ్య రుగ్మతలు దరిచేరవన్నారు. తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, వీరితో పాటు మూడో కుమార్తెగా వారి పేర్లలోని అక్షరాలతో సారణగా లేగదూడకు నామకరణం చేయడం సంతృప్తి నిచ్చిందన్నారు. ముందుగా సారణ కాళ్లకు పట్టీలు తొడిగి అలంకరించి గోపూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అత్యంత సాంప్రదాయ బద్ధంగా సారణగా లేగదూడకు నామకరణం చేశారు. ఇప్పుడీ దూడకు బారసాల నిర్వహించడం అందరినీ ఆకర్షించింది.

Tags:    

Similar News