విశాఖ జిల్లా అరకు లోయలో ప్రమాదం

Update: 2021-02-13 01:46 GMT

Representational Image

విహార యాత్ర విషాద యాత్రగా ముగిసింది. విశాఖ జిల్లా అరకు లోయలో జరిగిన ప్రమాదం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. అనంతగిరి మండలం డముకులో ఐదో నెంబరు మలుపు వారి పాలిట ముత్యుమలుపుగా మారింది. అదుపుతప్పిన టూరిస్ట్ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అప్పటి వరకు ఎంతో ఆనందంగా గడిపిన కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

చిమ్మ చీకటి దీనికి తోడు చలి వాతావరణం. లోయలో పడిపోయిన వారి కోసం మొబైల్ ఫోన్ల వెళుతురులో.. పోలీసుల ఫోకస్ లైట్లు.. టార్చిలైట్లతో వెదుకులాటలతో అరకు లోయ ఉద్విగ్నభరితంగా మారింది. రక్తపు మడుగులు, ఏడ్పులు, ఆర్తనాదాలు పెడుతుంటే సహాయక చర్యలు ఒళ్లు గగుర్పాటు కలిగించాయి. గాయపడిన వారి రోదనలు వింటున్న వారు గుండె బరువెక్కి విలపిస్తోంది.

ప్రముఖ పర్యాటక ప్రాంతమైన విశాఖలోని అరకులోయ హాహాకారాలతో దద్దరిల్లింది. చట్టూ చిమ్మ చీకటి, ఏమయ్యిందో ఎవరికీ అర్థం కాలేదు. తీవ్రగాయాలతో కొందరు, విగతజీవులుగా ఆ ప్రాంతం మారిపోయింది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా గడిపిన వారిలో తీవ్ర భయాందోళనలతో వణికిపోయారు. హైదరాబాద్‌ దినేష్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అరకు లోయలో పడిపోయింది. అనంతగిరి డముక వద్ద లోయలో టూరిస్టు బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. 20 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. వీరంతా హైదరాబాద్ కు చెందిన వారుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 24 మంది ఉన్నట్లు తెలుస్తోంది. షేక్ పేటకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారని సమాచారం. గాయాలపాలైన వారిని ఎస్.కోట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదానికి డ్రైవర్‌ అవగాహనలేమి కారణమని పోలీసులు అంచనా వేస్తున్నారు. తమ మాటలను పట్టించుకోకుండా బస్సును ముందుకు పోనిచ్చాడని తెలిపారు. దీంతోనే ప్రమాదం జరిగిందన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు తెలిపారు. అరకు రూట్ పై డ్రైవర్ కు ఎలాంటి అవగాహన లేదని ఘాట్ రోడ్డులో నడపడం రాదని డ్రైవర్ తమకు ముందే చెప్పలేదన్నారు. అమరావతి నుంచి వచ్చేటప్పుడే తమను డ్రైవర్ చాలా ఇబ్బంది పెట్టాడని ఓ బాధితురాలు తెలిపారు.

బస్సు ప్రమాదంపై ఏపీ, తెలంగాణ సీఎంలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జరుగుతున్న సహాయక చర్యల వివరాలను అడిగితెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అరకు లోయలో పడిపోయిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. దినేష్ ట్రావెల్స్ కు చెందిన బస్సు పూర్తిగా కండీషన్ లో ఉందా ? డ్రైవింగ్ లో డ్రైవర్ కు నైపుణ్యం ఉందా ? అనేది తెలియరావడం లేదు. 

Full View


Tags:    

Similar News