జగన్ కి కేసీఆరే మార్గదర్శి.. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కీలక వాఖ్యలు

Update: 2020-01-30 16:02 GMT

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్ పై బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంచలన వాఖ్యలు చేశారు. కోతికి అద్దమిస్తే ఏం చేయాలో తెలియక నేలకేసి కొట్టినట్లుగా జగన్‌ పాలన కొనసాగుతుందని, తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నట్లుగా జగన్‌ వ్యవహరిస్తున్నారని అయన వ్యాఖ్యానించారు. అనంతపురంలో జరిగిన బీజేపీ జిల్లా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ తో కలిసి పాల్గొన్న అయన ఆ తర్వాత మీడియాతో మాట్లాడి ఈ వాఖ్యలు చేశారు.

ఇక వైఎస్‌ జగన్‌ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గదర్శి అని అన్నారు. పేరుకే జగన్‌ సీఎం అని కానీ నిర్మాణం, కథ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే అన్నీ కేసీఆరేనని ఆయన అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా మాట్లాడిన కేసీఆర్‌ జగన్‌ కు ఇప్పుడు గురువుగా మారారని ఆయన వాఖ్యానించారు. ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కన్నా ఎక్కువగా అభివృద్ది చేస్తారని నమ్మి ప్రజలు జగన్‌ కు అధికారం ఇచ్చారని, కానీ జగన్ మాత్రం తెలంగాణ సీఎం కేసీఆర్‌ ను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రాన్ని వెనక్కి నెడుతున్నారని వాఖ్యానించారు. చంద్రబాబుపై కోపంతోనే జగన్‌ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని బైరెడ్డి విమర్శించారు

టీడీపీ నుంచి తన రాజకీయ జీవితాన్ని ఆరంభించిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి.. ఆ తరువాత టీడీపీకి రాజీనామా చేసి రాయలసీమ పరిరక్షణ సమితిని ప్రజల్లోకి తీసుకెళ్లారు. 2014 ఎన్నికల సమయంలో నంద్యాల పార్లమెంటుకు పోటీ చెయ్యాలని భావించారు. కానీ కుదరకపోవడంతో దూరంగా ఉన్నారు. ఎన్నికల అనంతరం టీడీపీలో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.. కానీ టిక్కెట్ హామీ లేకపోవడంతో చేరలేదు. దాంతో 2018 లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

అక్కడా ఇమడలేక సరిగ్గా 2019 సాధారణ ఎన్నికలకు పదిరోజుల ముందే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసి టీడీపీకి జై కొట్టారు. ఇదే సమయంలో ఆయన వైసీపీని సంప్రదించారు. కానీ ఆయన తమ్ముడి కుమారుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వైసీపీలోనే ఉన్నారు. పెదనాన్న రాకను ఆయన వ్యతిరేకించారు. దాంతో చేసేదేమి లేక నందికొట్కూరు టీడీపీ అభ్యర్థి తరుపున ప్రచారం చేశారు. అయితే టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన తాజాగా బీజేపీలో చేరారు. 

Tags:    

Similar News