'ఏపీకి మూడు రాజధానులు అవసరం.. అప్పుడే సమస్యకు పరిష్కారం'

Update: 2019-11-01 05:36 GMT

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అంశం చుట్టూ తీవ్ర చర్చ జరుగుతోంది. రాజధాని అభివృద్ధి, అలాగే రాష్ట్రం సమగ్రాభివృద్ధి గురించి చర్చించేందుకు వీలుగా ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ప్రస్తుతం ఆ కమిటీ పలు ప్రాంతాల్లో పర్యటిస్తోంది. వైసీపీ ప్రభుత్వం, మంత్రి బొత్స సత్యనారాయణ పలు దఫాలుగా మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో పెద్ద పెద్ద భవనాలు నిర్మించడం భారీ ఖర్చుతో కూడుకున్న పని అని చెబుతున్నారు. పైగా అక్కడ భూమి చాలా వదులుగా ఉన్నట్టు నిపుణులు కూడా గుర్తించారు. ఇదిలావుండగా రాజధానిని గనక తరలిస్తే మా ప్రాంతానికి రావాలంటే మా ప్రాంతానికి రావాలంటూ నేతలు కోరుతున్నారు.. బీజేపీ నేత, ఎంపీ టీజీ వెంకటేశ్ మరోసారి రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమని అప్పుడే రాయలసీమ అభివృద్ధి చెందుతుందని టీజీ వెంకటేశ్‌ అభిప్రాయపడ్డారు. గురువారం సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా కర్నూలులో నిర్వహించిన ర్యాలీ‌లో ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ డిక్లరేషన్‌కు బీజేపీ కట్టుబడి ఉందని.. ఎన్నో ఏళ్లుగా రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు.

ప్రస్తుతం అమరావతి పేరుకే రాజధానిగా ఉందని, కానీ అక్కడ రాయలసీమ వాసులకు ఉద్యోగాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంతానికి రాజధాని, హైకోర్టు అవసరమని అభిప్రాయపడ్డారు టీజీ. మూడు ప్రాంతాలు.. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు రాజధానులు అవసరమని ఆయన చెప్పారు. అలాగే రాయలసీమ వ్యాప్తంగా ప్రధాన నదులు ఉన్నా తాగేందుకు నీరు దొరక్క ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కృష్ణ, తుంగభద్ర జలాలు రాయలసీమకే చెందాలని ఆయన కోరారు.

Tags:    

Similar News