Bhuma Akhila Priya: మాజీమంత్రి భూమా అఖిలప్రియ అరెస్టు
Bhuma Akhila Priya: అఖిలప్రియ పీఏ మోహన్‌తో పాటు.. మరో ఇద్దరు అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Bhuma Akhila Priya: మాజీమంత్రి భూమా అఖిలప్రియ అరెస్టు
Bhuma Akhila Priya: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీమంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏవీ సుబ్బారెడ్డిపై భూమా వర్గీయులు చేసిన దాడిపై... పోలీసులు విచారణ చేపట్టారు. భూమా అఖిలప్రియ ఆమె పీఏ మోహన్‌తో పాటు... మరో ఇద్దరు అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం అఖిలప్రియను నంద్యాల తరలించారు.
నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నంద్యాల జిల్లాలో కొనసాగుతోన్న వేళ ఆ పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. రెండు వర్గాలుగా విడిపోయిన టీడీపీ నాయకులు పరస్పరం దాడులకు దిగారు. నడిరోడ్డు మీద కొట్టుకున్నారు. ఈ దాడులు టీడీపీ నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు. నంద్యాల జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య నిన్న ఘర్షణ చోటు చేసుకుంది. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోకి నారా లోకేష్ అడుగుపెట్టనున్న నేపథ్యంలో ఆయనకు ఘనస్వాగతం పలకడానికి భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి.. పెద్ద సంఖ్యలో తమ అనుచరులతో కొత్తపల్లికి చేరుకున్నారు. నారా లోకేష్ ముందు బల ప్రదర్శనకు దిగారు. తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు.
ఈ నేపథ్యంలోనే భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి.. మధ్య తొలుత మాటలయుద్ధం చోటు చేసుకుంది. ఒకరినొకరు పరస్పరం దూషించుకున్నారు. ఒక దశలో భూమా అఖిలప్రియ వర్గీయులు తొడగొట్టి సవాల్ విసిరారు. ఏవీ సుబ్బారెడ్డిని చుట్టుముట్టి రక్తం కారేలా కొట్టారు. పిడిగుద్దులు గుద్దారు. ఆయనను రోడ్డు మీదికి తోసిపడేశారు.
భూమా వర్గీయుల దాడిలో ఏవీ సుబ్బారెడ్డి నోటి నుంచి రక్తం కారింది. ఆయనను కొడుతున్నప్పుడు భూమా అఖిల ప్రియా అక్కడే ఉన్నారు. ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులను బెదిరించడం కనిపించింది. వారిపై ఘాటు పదాలతో విరుచుకుపడ్డారామె. ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో తన తరువాతే ఇంకెవరైనా అంటూ హెచ్చరించారు.
భూమా వర్గీయులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ..వారు ఏ మాత్రం లెక్కచేయలేదు. ఏవీ వర్గీయులను తరిమి కొట్టారు. నోటి నుంచి రక్తం కారుతున్న స్థితిలో కనిపించిన ఏవీ సుబ్బారెడ్డిని ఆయన వర్గీయులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుమారు అరగంట పాటు కొత్తపల్లి నడిరోడ్డు మీద ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే నంద్యాల డీఎస్పీ సీ మహేశ్వర్ రెడ్డి.. ఆసుపత్రికి వెళ్లి ఏవీ సుబ్బారెడ్డిని పరామర్శించారు. ఏవీ సుబ్బారెడ్డిపై దాడిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.