ఖాకీ… సమాజానికి రక్షణ కవచం : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

మంగళగిరిలోని ఎ.పి.ఎస్.పి. 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్ లో మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కలిసి 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామకపత్రాలు అందజేశారు.

Update: 2025-12-17 04:50 GMT

మంగళగిరి: ‘కానిస్టేబుల్ ఉద్యోగం పోలీస్ వ్యవస్థకు మూల స్థంభం లాంటిది. మీరు లేకపోతే పోలీస్ వ్యవస్థకు జీవం లేదు. ధైర్యమూ ఉండదు. మీ ఒంటిపై ఉన్న ఖాకీ డ్రస్సు కనబడితే ప్రజలకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. ఖాకీ… సమాజానికి రక్షణ కవచం వంటిది. అలాంటి ఖాకీ గౌరవాన్ని తగ్గించుకోవద్దు’ అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. శాంతిభద్రతలపైనే దేశాభివృద్ధి అయినా, రాష్ట్రాభివృద్ధి అయినా ఆధారపడి ఉంటుందన్నారు. అలాంటి శాంతిభద్రతలను పరిరక్షించే మీరు రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు చోదక శక్తులన్నారు. నియామక పత్రాలు స్వీకరించిన కానిస్టేబుళ్లంతా శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యతలు స్వీకరించి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

మంగళగిరిలోని ఎ.పి.ఎస్.పి. 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్ లో మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోంశాఖ మంత్రి వంగలపూడి అనితతో కలిసి కానిస్టేబుళ్ల నియామక పత్రాల ప్రదానం కార్యక్రమానికి డిప్యూటీ సీఎం హాజరయ్యారు. ముఖ్యమంత్రితో కలిసి శిక్షణకు ఎంపికైన 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నేను అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజునే పాలనలో సుస్థిరత కోసం, యువత భవిష్యత్తు కోసం నిలబడతామని మాటిచ్చాం. మేము అధికారంలోకి వచ్చేనాటికి అవినీతి వ్యవస్థీకృతమై ఉంది. వ్యవస్థీకృతమైన అవినీతిని పారదోలేందుకు చిత్తశుద్దితో ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి.. పంచాయతీరాజ్ శాఖలో పది వేల పైచిలుకు ఉద్యోగులకు ఒకేసారి పదోన్నతులు కల్పించాం. చంద్రబాబు నాయుడు దార్శనికత, సలహాలు, సూచనలతోనే అత్యతం పారదర్శకంగా ఈ ప్రక్రియను పూర్తి చేయగలిగాం. అదే కోవలో ఈ రోజున ఆరు వేల మందికి ఒకేసారి నియామక పత్రాలు అందిస్తున్నాం. వీరంతా నియామక పత్రాలు అందక మూడున్నరేళ్ల విలువైన కాలాన్ని కోల్పోయారు.’’ అని చెప్పారు. 

Tags:    

Similar News