AP Panchayat Elections: ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి: నిమ్మగడ్డ

AP Panchayat Elections:

Update: 2021-02-22 05:49 GMT
నిమ్మగడ్డ ఫైల్ ఫోటో

AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో సిబ్బంది అంకితభావంతో పని చేశారన్నారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌. ప్రతి విడతల్లోనూ అన్నిశాఖల ఉద్యోగులు పాల్గొన్నారని ఒకట్రెండు చోట్ల ఇబ్బందులున్నా.. సమన్వయం చేశారన్నారు. నాలుగు విడతలోనూ 80 శాతానికి పైగా పోలింగ్ నమోదవ్వడం ఆనందించదగ్గ విషయమన్నారు. ఎక్కడా ఎన్నికలు వాయిదా పడలేదని.. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు.

ఏపీ మొత్తం 4 దశల్లో పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నికల ప్రక్రియలో అధికార యంత్రాంగం అంకితభావంతో పని చేసిందని కితాబిచ్చారు. 10,890 మంది సర్పంచులు, 47,500 మంది వార్డు మెంబర్లు నేరుగా ఎన్నికైనట్లు వెల్లడించారు. మొత్తం 16 శాతం స్థానాలకు మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయన్నారు.

ఒక్కో విడతలో 90 వేలకు పైగా సిబ్బంది పని చేశారని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. 50 వేల మందికిపైగా పోలీసులు సమర్థంగా పని చేశారని, ప్రతి విడతలో 80 శాతానికి పైగా స్వచ్ఛందంగా ఓటింగ్‌లో పాల్గొన్నారని చెప్పారు. దీనిపై ఎన్నికల సంఘం పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తోందని వివరించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరపాలని ముందుగా భావించామని, అయితే కోర్టులో కేసుల కారణంగా కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయని ఎస్‌ఈసీ అన్నారు. అవాంతరాలు తొలిగి పోయాక ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. మార్చి 2 నుంచి పురపాలక ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు.

Tags:    

Similar News