రాజధానిపై ఈనెల 27న క్యాబినెట్ లో చర్చ.. జనవరిలో కీలక నిర్ణయం

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 2020 జనవరిలో జిఎన్ రావు కమిటీ నివేదికపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని యోచిస్తోంది.

Update: 2019-12-22 05:19 GMT
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 2020 జనవరిలో జిఎన్ రావు కమిటీ నివేదికపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని యోచిస్తోంది. రాజధాని వికేంద్రీకరణ అవసరమని కమిటీ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. పరిపాలనను అమరావతి, విశాఖపట్నం మరియు కర్నూలుకు విస్తరించాలని నివేదిక ఇచ్చింది. అంతేకాదు గుంటూరు జిల్లాలోని అమరావతి సహా మిగిలిన ప్రాంతాలను కలిపి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ప్రాంతీయ అభివృద్ధి మండలికి తీసుకురావాలని పేర్కొంది. కమిటీ ప్రతిపాదనలపై ఈనెల 27న క్యాబినెట్ లో చర్చించనున్నారు. ఆ తరువాత జనవరి మొదటి వారంలో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి పార్టీల అభిప్రాయాలను తీసుకుంటారు.

అనంతరం అసెంబ్లీని సమావేశపరచి అక్కడ కూడా చర్చిస్తారని సమాచారం. అంతకుముందు టీడీపీ ప్రభుత్వం.. సింగపూర్ చెందిన కంపెనీతో తుళ్ళూరులో సహా అమరావతిలో ప్రతిపాదిత 29 గ్రామాలకు 217 చదరపు కిలోమీటర్లు, 8,603 చదరపు కిలోమీటర్లతో ఒక మహానగరాన్ని నిర్మించటానికి మాస్టర్ ప్లాన్స్ తయారు చేయించింది. దీని కోసం ప్రభుత్వం రూ .900 కోట్లు ఖర్చు చేసింది. సింగపూర్ కు చెందిన కంపెనీ రాజధాని అభివృద్ధికి సంబంధిన మాస్టర్ ప్లాన్ ను రెడీ చేసింది. మొత్తం ఐదు దశల్లో అభివృద్ధి చెయ్యాలని ప్రతిపాదించింది.

అంతేకాదు 2029 నాటికి ఈ టార్గెట్ పూర్తవుతుందని చెప్పారు. ఈ క్రమంలో అమరావతిని 21 జోన్లుగా విభజించారు. ఇందులో భాగంగా తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడను అనుసంధించాలని నిర్ణయించారు. మొత్తం రాజధాని కోసం సేకరించిన 33,500 ఎకరాలను రాజధాని కేంద్రంగా మార్చారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఎస్‌ఆర్‌ఎం, డబ్ల్యుఐటి వంటి జాతీయ ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నాయి. మంగళగిరిలో ఎయిమ్స్ రాబోతోంది. అనంతపురం -అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే వెంట కృష్ణా నదిపై మరో రెండు వంతెనలను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ తరుణంలో రాజధాని ఫంక్షన్స్ ను అన్ని ప్రాంతాలకు తరలించాలని జిఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చింది.

ఈ ప్రతిపాదనను అమరావతిలో ఉన్న 29 గ్రామాల కొంతమంది రైతులు వ్యతిరేకిస్తున్నారు. రొజూ రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు. వారికి ప్రభుత్వ పెద్దలు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్‌భవన్, హైకోర్టు బెంచ్, శాసనసభ, మంత్రుల నివాసాలు అమరావతిలో ఉంటాయని.. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం చెబుతోంది. ఈ తరుణంలో జనవరిలో జరగబోయే అఖిలపక్ష సమావేశాల్లో రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.



Tags:    

Similar News