రెండేళ్ల ముందే ఎన్నికల బరిలోకి సీఎం జగన్

Ys Jagan Strategy: టార్గెట్ 2024.... 2019 హిస్టరీ రిపీట్ అవ్వాల్సిందే.. ఇంటింటికీ, గడపగడపకూ వెళ్లేలా కార్యాచరణ.

Update: 2022-03-16 09:56 GMT

రెండేళ్ల ముందే ఎన్నికల బరిలోకి సీఎం జగన్

Ys Jagan Strategy: టార్గెట్ 2024.... 2019 హిస్టరీ రిపీట్ అవ్వాల్సిందే.. ఇంటింటికీ, గడపగడపకూ వెళ్లేలా కార్యాచరణ.. మే నెల నుంచి ఎమ్మెల్యేల సచివాలయాల సందర్శన ఇలాంటి ఎన్నో అంశాలతో కేడర్‌కు టార్గెట్ ఫిక్స్ చేసేశారు వైసీపీ అధినేత జగన్. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ముందే ఉన్నా.. ఇప్పుడే, ఈ క్షణమే ప్రజాక్షేత్రంలోకి దూకేయాలన్నంతగా నేతలకు దిశానిర్ధేశం చేశారు. అందుకు తగ్గట్టే రెండేళ్ల రోడ్ మ్యాప్ సైతం సిద్ధం చేశారు. ఇంతకూ ముఖ్యమంత్రి జగన్ ఎలక్షన్ స్ట్రాటజీ ఏంటి..? జగన్ కొత్తటీమ్‌లో ఉండేదెవరు, వైదొలిగేదెవరు..?

ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల్లో ఉండాలి.. క్యాడర్‌ను ప్రజలకు దగ్గర చేయాలి.. మూడేళ్ల వైసీపీ అభివృద్ధి ప్రజల్లోకి తీసుకెళ్లాలి.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు గడపగడపకూ చేరిపోవాలి. ఇవీ వైసీఎల్పీ భేటీలో కేడర్‌కు జగన్ ఫిక్స్ చేసిన టార్గెట్స్. 2024 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నారనేందుకు, 2019 ఫలితాలను రిపీట్ చేయాలని భావిస్తున్నారని చెప్పేందుకు వైసీపీ శాసనసభాపక్ష సమావేశమే వేదికైంది. ఇదే సమయంలో కేబినెట్ మార్పులూ చేర్పులపైనా ఫుల్‌ క్లారిటీ వచ్చేసింది. ఐదారుగురు మినహా మిగిలిన అందరి ప్లేసులు భర్తీ అయిపోతయని, వారికి కొత్త బాధ్యతలు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి ప్రకటించేశారు.

2019లో ఊహించని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ 2024లోనూ ఆ విజయాన్ని రిపీట్ చేయడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే వైసీఎల్పీ భేటీలో పార్టీ కేడర్‌కు కీలక దిశానిర్ధేశం చేశారు ముఖ్యమంత్రి జగన్. భవిష్యత్తులో అధికారం నిలబెట్టుకోవాలంటే ఎమ్మెల్యేలు, నేతలు ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలనే దానిపై దిశానిర్ధేశం చేశారు. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయి పర్యటనలపై నేతలంతా దృష్టిసారించాలని జగన్ ఆదేశించారు.

టార్గెట్ 2024 ప్రణాళిక ఇదే.. 2024లో హిస్టరీ రిపీట్ చేయడం కోసం పక్కా స్కెచ్‌తో కార్యాచరణ సిద్ధం చేసేశారు. ఇందులో భాగంగా కొత్త మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలని జగన్ తేల్చి చెప్పారు. నెలకు 10 సచివాలయాల సందర్శన ఉండాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే బూత్ కమిటీల్ని బలోపేతం చేయాలని సూచించారు. మరోవైపు సంక్షేమ పథకాల అమలును క్షేత్రస్ధాయిలో పరిశీలించడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం గడపగడపకు వెళ్లాలని ఆదేశించారు.

ఇదే సమయంలో ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారట. చాలామంది ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ క్షణం నుంచే ఎమ్మెల్యేలంతా పనిచేయాలని ఆదేశించారు. ఏ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులున్నాయో సమగ్ర నివేదిక తనదగ్గర ఉందన్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేలపై ఆరోపణలు వస్తున్నాయన్న జగన్ కష్టపడి పనిచేయకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించినట్టు తెలుస్తోంది.

ఇదే సమయంలో మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ పెరిగిపోతున్న వేళ ప్లీనరీ తర్వాతే కేబినెట్‌లో మార్పులు, చేర్పులూ అని ప్రకటించేశారు. 2019లో అధికారంలోకి రాగానే చేపట్టిన కేబినెట్ విస్తరణలో ఐదుగురు డిప్యూటీ సీఎంలతో పాటు మహిళా హోంమంత్రికి అవకాశం కల్పించిన జగన్ ఇప్పుడు మరోసారి అదే మోడల్‌ను రిపీట్ చేయాలని భావిస్తున్నారట. ఇందులో భాగంగా కొత్త కేబినెట్‌లోనూ అదే సామాజిక సమీకరణాలతో, మహిళా సమీకరణాలతో ప్రక్షాళన చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పాత కేబినెట్ సమీకరణాలతోనే కొత్త కేబినెట్ ఏర్పాటు కానున్నట్టు కనిపిస్తోంది.

ప్రస్తుత కేబినెట్‌‌లో ఉన్న మంత్రుల్లో ప్రక్షాళనలో భాగంగా ఐదారుగురికి మాత్రమే కొనసాగింపు ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. ఈ మేరకు తాజా వైసీఎల్పీ భేటీలో మరోసారి జగన్ క్లారిటీ ఇచ్చేశారు. గతంలో ప్రకటించిన విధంగానే 90 శాతం కేబినెట్ మంత్రులకు ఉద్వాసన పలకబోతున్నారు. ప్రస్తుత కేబినెట్‌లో ఉన్న ఆర్ధికమంత్రి బుగ్గన, విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేనిలో ఒకరిని కొనసాగించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే పేర్నినాని, కొడాలినానిని కొనసాగిస్తారన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అలాగే తనకు సన్నిహితుడైన పెద్దిరెడ్డిని సైతం జగన్ కొనసాగించబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

రెండేళ్ల ముందునుంచే జగన్ ఎలక్షన్ స్ట్రాటజీపై ఫోకస్ చేయడం వెనుక పీకే వ్యూహం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాల్లో ఏమాత్రం తగ్గకుండా విజయం సాధించాలని టార్గెట్స్ ఫిక్స్ చేసుకున్నారట. ఇందుకోసమే విపక్ష పార్టీలు కుదురుకునే ఛాన్స్‌ ఇవ్వకుండా వేగంగా జనంలోకి వెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అవసరమైన ప్రక్షాళనలు చేస్తూనే క్యాడర్‌ను మరింత బలంగా మార్చుకుని ఎన్నికల నాటికి తిరుగులేని శక్తిగా మారాలని జగన్ భావిస్తున్నారంటున్నాయి వైసీపీ శ్రేణులు. మొత్తంగా జగన్ దూకుడుతో ఏపీలో ఇప్పుటి నుంచే ఎన్నికల వేడి రాజుకుంది. ఇక ముందు జగన్ నిర్ణయాలు ఇంకెలాంటి సంచలనాలకు వేదికవుతాయో చూడాలి.

Tags:    

Similar News