ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..

Update: 2019-11-10 03:08 GMT

డిసెంబర్ మొదటివారంలో ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల్లో స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్వహణ తేదీలను ఖరారు చేయనున్నారు. నూతన ఇసుక, మద్యం పాలసీలను అసెంబ్లీలో ఆమోదించనుంది ప్రభుత్వం. అలాగే కీలకమైన రాజధాని అంశంపై ప్రకటన చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా రాష్ట్రం సమగ్రాభివృద్ధికి సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను కూడా అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సీజనల్ వ్యాధులు, ఉగాది నాటికి 25 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణి వంటి అంశాలపైనా అసెంబ్లీ చర్చించనుంది. అలాగే కృష్ణా, గోదావరి అనుసంధానంపై నిపుణులు సూచించిన బనకచర్ల రిజర్వాయర్ ప్రతిపాదనపై కూడా అసెంబ్లీలో చర్చించనున్నట్టు సమాచారం.

రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులు, పోతిరెడ్డిపాటు సామర్ధ్యం పెంపు అంశాలపై కూడా ఈ అసెంబ్లీలోనే చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లాలో 40 టీఎంసి సామర్ధ్యంతో నిర్మించిన వెలిగొండ ప్రాజెక్ట్.. దాని మొదటి టన్నెల్ నిర్మాణం వచ్చే ఏడాది మార్చితో పూర్తవుతుంది.ఈ నేపథ్యంలో శ్రీశైలం నికర జలాల కేటాయింపుపై వివాదాలు తలెత్తుండా రాయలసీమ వాసుల్ని సంతృప్తి పరిచేలా అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. లేదంటే ఈ అంశం వచ్చే ఏడాది నాటికీ వాయిదా పడే అవకాశం ఉంది. 

Tags:    

Similar News