ఆ సొమ్ము ప్రధాని మోదీది కాదు : వైసీపీ ఎమ్మెల్యే అంబటి
కరోనాను ఎదుర్కొనేందుకు దేశమంతా కలిసి పోరాటం చేస్తుంటే చంద్రబాబు మాత్రం రాజకీయం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు.
కరోనాను ఎదుర్కొనేందుకు దేశమంతా కలిసి పోరాటం చేస్తుంటే చంద్రబాబు మాత్రం రాజకీయం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. కరోనా ప్రభావంతో దేశ, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు చాలా కష్టాల్లో ఉన్నాయని, మహమ్మారి వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యమని అంబటి తెలిపారు.
కరోనా మహమ్మారి నుంచి రక్షించేందుకు వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ టీడీపీ నేతలు అడ్డగోలుగా విమర్శలు చేస్తూ ట్వీట్లు చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ డబ్బులు పంచుతున్నామని బీజేపీ నేతలు అంటున్నారని, ఆ సొమ్ము ప్రధాని మోదీదో, సీఎం జగన్‌దో కాదని, ప్రజల సొమ్ము అని వివరించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, కన్నా లక్ష్మీనారాయణ విధానాలు ఒకేలా ఉన్నాయని ఆరోపించారు.
రెవెన్యూ లోటు కింద 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం నిధులు విడుదల చేసిందని, ఏపీతో పాటు మరో 13 రాష్ట్రాలకు నిధులు విడుదల చేశారని, ఏపీకి ప్రత్యేకంగా ఏం కేటాయించలేదని గుర్తు చేశారు. రూ.1000 ఇచ్చి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలన్నట్టు ఓ వీడియోను సృష్టించారని, కన్నా లక్ష్మీనారాయణకు చిత్తశుద్ధి ఉంటే ఆ వీడియో ఎక్కడినుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.