Andhra Pradesh Local News @12PM: ఫ్యూజన్ ఫుడ్స్ పై అధికారుల చర్యలు..గరికపాడు చెక్ పోస్ట్ వద్ద దొరికిన నగదు

Andhra Pradesh Local News @12PM: ఈరోజు ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్ వివిధ ప్రాంతాల్లో జరిగిన సంఘటనల సమాహారం ఒకే చోట అందిస్తున్నాం.

Update: 2020-11-15 07:23 GMT

 తూర్పు గోదావరి జిల్లాలో అగ్ని ప్రమాదం 

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం లక్మి నరసాపురంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కోళ్ల ఫారం పూర్తిగా మంటల్లో తగలబడింది. కోళ్ళ ఫారం లో ఉన్న సుమారు ఐదు వందల కోళ్ళకు పైగా తగలబడి మాడి మసైయిన పరిస్థితి నెలకొంది. పిఠాపురం నుండి అగ్ని మాపక సిబ్బంది వచ్చేలోపే పాక పూర్తిగా తగలబడింది. స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కొన్ని కోళ్లు బయటకు వచ్చి ప్రాణాలు రక్షించుకున్నాయి. బాణాసంచా కారణంగా తారాజువ్వ పడి ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ అగ్ని ప్రమాదం వలన కోళ్ళ ఫారం యజమానికి భారీ నష్టం సంభవించింది.

గన్నవరంలో అగ్ని ప్రమాదం 

కృష్ణాజిల్లా గన్నవరంలోని గౌడపేటలో అగ్నిప్రమాదం జరిగింది. టపాసు రవ్వలు పడి ఓ పూరిల్లు అంటుకుంది. దీంతో మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక దళాలు రంగంలోకి దూకాయి. మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి.

ఫ్యుజన్ ఫుడ్స్ ఖాళీ చేయిస్తున్న అధికారులు 

విశాఖ జిల్లాలో వీఎంఆర్‌డీ స్థలాలను ఆక్రమించినవారిపై అధికారులు సీరియస్‌ అవుతున్నారు. లీజు గడువు ముగిసినా ఇంకా వీఎంఆర్‌డీ స్థలాలను ఖాళీ చేయని వారిపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు. సిరిపురం జంక్షన్‌లో ఫ్యూజన్ ఫుడ్స్‌‌ను ఖాళీ చేయించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులను భారీగా మోహరించారు. 2024 వరకూ గడువు ఉందని ఫ్యూజన్‌ ఫుడ్స్‌ యజమాని చెబుతున్నారు. లీజు గడువు అయిపోవడంతో ఖాళీ చేయిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

విజయనగరం గిరిపుత్రులకు డోలీ కష్టాలు 

విజయనగరం జిల్లాలో గిరిపుత్రులకు డోలీ కష్టాలు తప్పడం లేదు. అర్ధరాత్రి ఓ గర్భిణికి నొప్పులు రావడంతో వైద్యం నిమిత్తం 10 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చింది. టార్చిలైట్‌ సాయంతో డోలీలో మోసుకువెళ్లారు. దబ్బగుంట వరకూ డోలీలో మోసుకుంటూ వచ్చి అక్కడి నుంచి ఆటోలో శృంగవరపు కోటకు తరలించారు.

గరికపాడు చెక్ పోస్ట్ వద్ద దొరికిన 50 లక్షలు 

కృష్ణా జిల్లా గరికపాడు చెక్‌పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. కారులో తరలిస్తున్న 50 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ తరలిస్తుండగా నగదు పట్టుకున్నారు. ఎటువంటి పత్రాలు లేకపోవడంతో హవాలా డబ్బుగా అనుమానిస్తున్నారు. కారులో ఉన్న వ్యక్తులను విచారిస్తున్నారు. ఇక స్వాధీనం చేసుకున్న సొమ్మును ఆదాయపన్నుశాఖకు అప్పగిస్తామంటున్నారు పోలీసులు.

Tags:    

Similar News