ఏపీ నూతన గవర్నర్‌కు ఘనస్వాగతం

Update: 2019-07-23 15:06 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధమైంది. బుధవారం ఏపీ నూతన గవర్నర్ గా విశ్వబూషన్ ప్రమాణం చేయనున్నారు. ఇక మంగళవారం రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలను హరిచందన్ దంపతులు దర్శించుకున్నారు.

ఏపీ నూతన గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్‌ హరిచందన్‌ బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంగళవారం ఆయన కుటుంబసభ్యులతో తిరుమల స్వీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ అధికారులు బిశ్వభూషణ్‌కు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు.

ఈ సందర్భంగా బిశ్వభూషణ్‌ను టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సత్కరించి స్వామి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. వేంకటేశ్వరుడి ఆలయ సందర్శన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఎప్పటినుంచో తిరుమలకు రావాలని అనుకుంటున్నా సాధ్యపడలేదన్నారు. ఆ భగవంతుడి ఆశీర్వాదంతో దర్శించుకునే మహద్భాగ్యం కలిగిందని చెప్పారు.

అనంతరం హరిచందన్‌, ఆయన సతీమణి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్‌ దంపతులకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఘనస్వాగతం పలికారు. మంత్రులు, ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు. గవర్నర్‌ విశ్వభూషణ్‌ ఏపీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

ఏయిర్‌పోర్టు నుంచి కనకదుర్గాదేవి దర్శనార్థం విజయవాడ చేరుకున్నారు. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఇంద్రకీలాద్రిపై మేళతాళాలు, పూరణకుంభంతో గవర్నర్‌కు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం విశ్వభూషణ్‌ వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఈవో కోటేశ్వరమ్మ ఆయనకు అమ్మవారి చిత్ర పటం, ప్రసాదం, పట్టువస్త్రాలను అందించారు.

ఏపీ నూతన గవర్నర్‌గా విశ్వభూషన్‌ బుధవారం ఉదయం 11.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ విశ్వభూషణ్‌తో గవర్నర్‌గా ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం అతిథులకు రాజ్‌భవన్‌ అధికారులు తేనీటి విందు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News