Bishwa Bhushan Harichandan: విపత్కర పరిస్ధితులలో రెడ్ క్రాస్ వాలంటీర్ల ఆవశ్యకత ఉంది : ఏపీ గ‌వ‌ర్న‌ర్

Update: 2020-06-26 12:21 GMT
AP red Cross

కరోనాపై పోరులో సుమారు రెండు వేల మంది వాలంటీర్లు పాల్గొన్నారని, 65 రోజుల లాక్ డౌన్ కాలంలో రెడ్ క్రాస్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ బ్రాంచ్ ప్రభుత్వ కార్యకలాపాలకు ఉప‌యోగ‌ప‌డింద‌ని ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడ రాజ్ భవన్ లోని దర్బార్ హాల్ లో భారత రెడ్‌క్రాస్ సొసైటీ ఏపీ బ్రాంచ్ నూతన వాలంటీర్ల నమోదు కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్‌ను గవర్నర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ .. పాఠశాలల్లో జూనియర్ రెడ్‌క్రాస్, యూత్ రెడ్‌క్రాస్ యూనిట్లను ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న‌ తెలిపారు. క‌రోనా లాంటి విపత్కర పరిస్ధితులలో శిక్షణ పొందిన వాలంటీర్ల అవ‌స‌రం ఉంద‌ని పేర్కోన్నారు.

విద్యాసంస్థ‌ల్లో యూత్ రెడ్‌క్రాస్ యూనిట్లను స్థాపించడానికి, సంబంధించిన సమాచారం పాఠ్యాంశాల్లోకి చేర్చడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యా శాఖల అధిపతులను గవర్నర్ ఆదేశించారు. మొబైల్ యాప్ ద్వారా యువ వాలంటీర్లను పెద్ద సంఖ్యలో చేర్చుకోవటానికి, వారితో నిరంత‌రం ద‌గ్గ‌ర కావ‌డానికి ఈ యాప్ సహాయ పడుతుందని గవర్నర్ చెప్పారు. కరోనా వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోంటున్నార‌ని, ఈ మ‌హ‌మ్మ‌రి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని బిశ్వ భూషణ్ అన్నారు. మాన‌వాళి ఇప్పుడు అదృశ్య శత్రువుపై పోరాడవలసి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. అతిపెద్ద ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిలో మనం ఉన్నామని సమిష్టిగా.. సమాజ పరంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని గ‌వ‌ర్న‌ర్ పిలుపునిచ్చారు.

క్లిష్ట స‌మ‌యంలో లాక్ డౌన్ కాలంలో మార్చి 25 నుంచి 31 మే వరకు సహాయక శిబిరాలను నిర్వహణ, ఆహార ప్యాకెట్ల పంపిణీ, భౌతిక‌ దూరాన్ని పాటించేలా.. ప్రజలకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలతో తమ వాలంటీర్లు ఫ్రంట్‌లైన్ యోధులకు సహాయాన్ని అందించారని గవర్నర్ అన్నారు. స్వచ్ఛంద రక్తదానం, చెట్ల పెంపకం వంటి వాటిపై దృష్టి పెట్టాలని గవర్నర్ రెడ్‌క్రాస్ బాధ్యులను ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా రెడ్ క్రాస్ ఏపీ స్టేట్ బ్రాంచ్ ప్రధాన కార్యదర్శి ఎకె ఫరిడా మాట్లాడుతూ.. దేశంలోనే ఈ తరహా యాప్ మొట్ట మొదటిదన్నారు. ఛైర్మన్ డాక్టర్ ఎ. శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. గవర్నర్ పర్యవేక్షణలో ఏపీ రెడ్ క్రాస్ సొసైటీ విభిన్న సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి, రెడ్ క్రాస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముఖేష్ కుమార్ మీనా, ఉన్నత విద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర ప‌లువురు అధికారులు పాల్గొన్నారు.


Tags:    

Similar News