Andhra Pradesh: ఏపీలో మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!

Andhra Pradesh government planning: ఇంతవరకు సంక్షేమ పథకాలను అధికంగా అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేస్తోంది.

Update: 2020-09-03 00:51 GMT

Andhra Pradesh | ఇంతవరకు సంక్షేమ పథకాలను అధికంగా అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేస్తోంది. అవకాశమున్న చోటల్లా రిజర్వాయర్లను నిర్మాణం చేసి, తద్వారా సాగు భూమిని పెంచేందుకు తన వంతు పాత్ర పోషించేందుకు సిద్ధం అవుతోంది. రాయలసీమలో పలు ఎత్తిపోతలతో పాటు ఈ రిజర్వాయర్లను నిర్మాణం చేసేందుకు సంకల్పించింది. వీటివల్ల సుమారుగా 70వేల ఎకరాలకు సాగు నీరందే అవకాశం ఉంటుంది. ,

చిత్తూరు జిల్లాలోని పశ్చిమ మండలాలకు కృష్ణా నదీ జలాలను తరలించి సుభిక్షం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ముదివేడు వద్ద రెండు టీఎంసీలు, నేతిగుంటపల్లి వద్ద ఒక టీఎంసీ, ఆవులపల్లి వద్ద 3.5 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ల నిర్మాణానికి రూ.2,144.50 కోట్లను మంజూరు చేసింది. ఈ రిజర్వాయర్ల ద్వారా కొత్తగా 70 వేల ఎకరాలకు నీళ్లందించనున్నారు. 40 వేల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించనున్నారు. తాగునీటి సమస్యనూ పరిష్కరించనున్నారు. ఈ పనులు చేపట్టేందుకు పరిపాలన అనుమతి మంజూరు చేస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

► వైఎస్సార్‌ కడప జిల్లాలో గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం ప్రధాన కాలువ నుంచి నీటిని చక్రాయిపేట ఎత్తిపోతల ద్వారా హంద్రీ–నీవా రెండో దశలోని పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌(పీబీసీ)కి తరలిస్తారు.

► పీబీసీ 125.4కి.మీ. నుంచి కురుబలకోట మండలం ముదివేడు వద్ద కొత్తగా నిర్మించే రిజర్వాయర్‌ను నింపుతారు. దీని నిర్మాణానికి రూ.759.5 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ జలాశయం కింద 20 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లందిస్తారు. 15 వేల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరిస్తారు.

► పీబీసీలో 180.4 కి.మీ. నుంచి నీటిని ఎత్తిపోసి.. పుంగనూరు మండలం నేతిగుంటపల్లి వద్ద నిర్మించే రిజర్వాయర్‌ను నింపుతారు. దీని నిర్మాణానికి రూ.717.80 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. దీని కింద కొత్తగా పది వేల ఎకరాలకు నీళ్లందిస్తూనే ఐదు వేల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరిస్తారు.

► పీబీసీలో 210 కి.మీ. నుంచి నీటిని తరలించి.. సోమల మండలం ఆవులపల్లి వద్ద నిర్మించే రిజర్వాయర్‌ను నింపుతారు. ఈ రిజర్వాయర్‌ పనులకు రూ.667.20 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. దీని ద్వారా కొత్తగా 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించి, 20 వేల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించనున్నారు.

రూ.680 కోట్లతో జిల్లేడుబండ రిజర్వాయర్‌...

► అనంతపురం జిల్లాలోని ధర్మవరం, ముదిగుబ్బ, తాడిమర్రి, బత్తలపల్లి మండలాల్లో సాగు, తాగునీటి అవసరాల కోసం.. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రతిపాదన మేరకు జిల్లేడుబండ వద్ద 2.18 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మించనున్నారు.

► ఇందుకు గాను రూ.680 కోట్లను ప్రభుత్వం మంజూరు చేస్తూ బుధవారం పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఈ రిజర్వాయర్‌ ద్వారా 22,500 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు.

రూ.16.70 కోట్లతో మూడు చెరువులకు ఎత్తిపోత

► వైఎస్సార్‌ కడప జిల్లా ముద్దనూరు మండలంలో మూడు చెరువులను నీటితో నింపే పనులు చేపట్టడానికి రూ.16.70 కోట్లతో ప్రభుత్వం బుధవారం పరిపాలన అనుమతి ఇచ్చింది.

► గండికోట రిజర్వాయర్‌ నుంచి మంగపట్నం చెరువును నింపే పనులు చేపట్టడానికి రూ.5.93 కోట్లను, గంగాదేవిపల్లి చెరువును నింపే పనులకు రూ.4.74 కోట్లను, వామికొండ రిజర్వాయర్‌ నుంచి ఉప్పలూరు వద్ద పూలచెరువును నింపే పనులకు రూ.6.03 కోట్లను మంజూరు చేశారు. 

Live Updates
NO MORE UPDATES
Tags:    

Similar News