Free Electricity: 6 వేల మెగావాట్లకు టెండర్లు.. శాశ్వత 'ఉచిత విద్యుత్‌'లో మరో కీలక అడుగు

Free Electricity | పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ అందించే 'వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌' పథకాన్ని మరో 30 ఏళ్లు సమర్ధవంతంగా అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.

Update: 2020-09-19 00:58 GMT

Free Electricity | పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ అందించే 'వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌' పథకాన్ని మరో 30 ఏళ్లు సమర్ధవంతంగా అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఈ పథకం కోసమే ప్రత్యేకంగా చేపట్టిన 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియను మొదలుపెట్టింది. తొలిదశలో.. అనంతపురం, వైఎస్సార్‌ కడప, ప్రకాశం, కర్నూల్‌ జిల్లాల్లో 6,050 మెగావాట్లకు టెండర్లు పిలుస్తున్నట్లు గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఓ ప్రకటనలో తెలిపిందిఇందులో ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా టెండర్‌ డాక్యుమెంట్లను న్యాయ సమీక్ష (జ్యూడీషియల్‌ ప్రివ్యూ)కు పంపింది. 

ఆంధ్రప్రదేశ్‌ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ పర్యవేక్షణలో జరిగే టెండర్లకు సంబంధించిన సమాచారాన్ని ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉండేలా జ్యూడీషియల్‌ ప్రీవ్యూ అధికారిక వెబ్‌సైట్‌ 'డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ. జ్యూడీషియల్‌ ప్రివ్యూ.ఏపీ.జీవోవీ.ఇన్‌'లో పొందుపర్చింది. వీటిని పరిశీలించి ప్రజలు, కాంట్రాక్టు సంస్థలు, నిపుణులు అవసరమైన సలహాలు, సూచనలు ఈనెల 25లోగా 'ఏపీజ్యూడీషియల్‌ప్రీవ్యూ ఎట్‌ ది రేట్‌ జీమెయిల్‌ డాట్‌ కామ్‌ లేదా 'జడ్జి–జేపీపీ ఎట్‌ ది రేట్‌ ఏపీ డాట్‌ జీవోవీ డాట్‌ ఇన్‌కు పంపవచ్చని ఏపీ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ తెలిపింది. పీఎంయు డాట్‌ ఏపీజీఈసీఎల్‌ ఎట్‌ ది రేట్‌ జీమెయిల్‌ డాట్‌ కామ్‌'కు కూడా సూచనలు పంపవచ్చని తెలిపింది.జ్యూడీషియల్‌ ప్రివ్యూ తర్వాతే పనులకు సంబంధించిన టెండర్లు పిలుస్తారని పేర్కొంది.

ప్రస్తుతం ఏపీలో 17.55 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా జరుగుతోంది. అందులో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2.89 లక్షల కనెక్షన్లుంటే అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో కేవలం 31,526 కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రం మొత్తంగా 12,232 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. దాని కోసం ఏటా రూ. 8,353 కోట్లు వ్యయం చేస్తున్నట్టు ఇంధన శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఉచిత వ్యవసాయ విద్యుత్‌తో పాటుగా ఆ తర్వాత ఉచిత గృహ విద్యుత్ పథకం కూడా అమల్లోకి వచ్చింది. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్ అందిస్తున్నారు. ఇందుకోసం రూ. 220 కోట్లు ప్రభుత్వం తరుఫున వెచ్చిస్తున్నారు.

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్వారంగానికి విద్యుత్ సబ్సీడీ కోసం రూ. 450 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇక సాధారణ గృహ విద్యుత్ వినియోగదారులకు సబ్సీడీ కింద మరో రూ.1707 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం ప్రభుత్వం భరిస్తోంది. వాటితో పాటుగా చేనేత, స్వర్ణ, రజకులు, క్షురకుల కోసం కూడా సబ్సీడీపై విద్యుత్‌ని అందిస్తున్నారు. మొత్తంగా 2020-21 ఆర్థిక సంవత్సరానికిగానూ విద్యుత్ సబ్సీడీల కోసం రూ.11వేల కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో అమలవుతున్న ఉచిత విద్యుత్ పథకంలో నగదు బదిలీ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నిర్ణయం కారణంగానే ఈ విధానం తప్పనిసరైందంటూ మార్గదర్శకాలు జారీ చేసింది.

ఈ ఏడాది మే 17న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం నాలుగు రకాల సంస్కరణలు తప్పనిసరిగా మారాయని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. దాని ప్రకారం 2021-22 రాష్ట్రమంతటా ఉచిత విద్యుత్ పథకంలో నగదు బదిలీ అమలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ సహా అందరికీ ఇకపై మీటర్లు ఏర్పాటు చేస్తుంది. వినియోగించిన విద్యుత్ యూనిట్ల ప్రకారం రైతుల ఖాతాలోకి నగదు బదిలీ చేస్తారు. దానిని రైతులు నేరుగా విద్యుత్ సరఫరా కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఆఖరిలోగా కనీసం ఒక్క జిల్లాలోనైనా దీన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయాల్సి ఉందని ఏపీ ఇంధనశాఖ చెబుతోంది. 

Tags:    

Similar News