స్థానిక ఎన్నికలకు సిద్దంగా ఉండాలి.. ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు
మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపనలో పంచాయతీ రాజ్ వ్యవస్థ ముఖ్య పాత్ర పోషిస్తుందని ఆంధ్రప్రదేశ్ నూతన ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజ్ అన్నారు.
మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపనలో పంచాయతీ రాజ్ వ్యవస్థ ముఖ్య పాత్ర పోషిస్తుందని ఆంధ్రప్రదేశ్ నూతన ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజ్ అన్నారు.ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి కీలక భూమిక పోషిస్తుందని జస్టిస్ కనగరాజ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయ సిబ్బందితో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా అంతా సన్నద్ధంగా ఉండాలని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్‌కు అధికారులు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల యథాతథ స్థితిని వివరించారు. ఈ సందర్భంగా అధికారులకు విధుల్లో సమన్వయంతో వుండాలని, అందరూ సమర్థవంతంగా పనిచేయాలని కోరారు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చివరి వ్యక్తి వరకు చేరాలనే ఉద్దేశ్యంతో స్థానిక సంస్థలను ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలో జడ్పీటీపీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చిన అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. అందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజు సూచించారు.