కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ను ఏపీ ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తుంది. లాక్ డౌన్ సందర్భంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణాలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఏపీ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది.
అత్యవసర సేవలకు అంటే వైద్యం, స్వఛ్చంద సేవలు, ప్రభుత్వ విధులు, ప్రయాణాలు చేసే వారి కోసం ఏపీ ప్రభుత్వం అత్యవసర రవాణా పాసులు అందిస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజలు అత్యవసర కారణాలను చూపి ఈ పాసులు పొందొచ్చని వెల్లడించింది.
ఇక పాసులు రవాణా పాసులు కావాల్సిన వారు ఆధార్ కార్డు వివరాలు, పేరు, పూర్తి చిరునామా, వాహనం నంబర్, ప్రయాణికుల సంఖ్య, అలాగే ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించాలనే.. పూర్తి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. అన్ని డ్యాక్యుమెంట్స్ పరిశీలించిన తర్వాత సాధ్యమైనంత త్వరగా.. సంబంధిత పోలీసు అధికారులు పాసులు జారీ చేస్తారు. ఇక తప్పుడు సమాచారం ఇస్తే కేసులు నమోదు చేస్తామని డీజీపీ కార్యాలయం ప్రకటించింది.
కోవిడ్-19 అత్యవరస వాహనాల పాసులు కావాలనుకునే వారు తమ ప్రదేశానికి సంబంధించి వివరాలతో... జిల్లా ఎస్పీల వాట్సాప్ నంబర్ కు లేదా మెయిల్ ఐడీకి వివరాలు పంపించి అనుమతి కోరాలి. అధికారులు అన్ని పరిశీలించి వ్యక్తికి మొబైల్ నెంబర్ లేదా మెయిల్ ఐడీకి వాహనాల పాస్‌ను పంపిస్తారు. జిల్లా ఎస్పీ నుంచి వచ్చిన అనుమతులు తీసుకున్న వాహనాలకు పాసులు చెల్లుబాటు అవుతాయి. ఎవరికైనా పాసులు ఫార్వార్డ్ చేసిన ఆ పాసులు చెల్లవు.
..