Ambulance catches fire: నడిరోడ్డుపై తగలబడిపోయిన అంబులెన్స్
Ambulance catches fire in Vijayawada: విజయవాడలో రోడ్డుపై ఒక పక్కన పార్క్ చేసి ఉన్న అంబులెన్స్ లో మంటలు చెలరేగి పూర్తిగా తగలబడిపోయింది. మంటల్లో పూర్తిగా దగ్ధమైన అంబులెన్స్ విజయవాడలోని రమేశ్ ఆస్పత్రికి చెందిన వాహనంగా తెలుస్తోంది.
ఈ ఘటన జరిగిన సమయంలో అంబులెన్స్ లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
అంబులెన్స్ లో చెలరేగిన మంటలు ఆ పక్కనే ఉన్నబస్టాండ్ కు కూడా వ్యాపించాయి. దాంతో బస్టాండ్ కూడా పాక్షికంగా దెబ్బతింది.
రమేశ్ హాస్పిటల్స్ ఎదురుగానే ఈ ఘటన జరగడంతో ఆస్పత్రి సిబ్బంది వెంటనే ఆస్పత్రిలోని ఫైర్ ఎక్విప్‌మెంట్ తీసుకొచ్చి మంటలను ఆర్పినట్లు తెలుస్తోంది. కానీ అప్పటికే అంబులెన్స్ వాహనం పూర్తిగా కాలిపోయింది.
అంబులెన్స్‌లో అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఈ ఘటనపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆగి ఉన్న అంబులెన్స్‌లో మంటలు ఎలా చెలరేగాయనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు.