నిబంధనలు పాటించానని చెబుతున్న లింగమనేని..అవసరమైన ఆధారాలు బయటపెడతానన్న ఆర్కే

Update: 2019-09-25 13:14 GMT

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్‌ ఇల్లు కూల్చివేత నోటీసులపై పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. తన ఇంటిని పక్కా నిబంధనలను పాటించే నిర్మించానని లింగమనేని చెబుతుంటే రమేష్‌ చెబుతున్నవన్నీ పచ్చి అబద్దాలంటూ వైసీపీ ఎదురుదాడికి దిగింది. తన ఇంటిని కూల్చివేయవద్దంటూ సీఎం జగన్‌కు లేఖ రాసిన లింగమనేని వ్యవహారం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు.

కృష్ణా నది కరకట్టపై తన అతిథిగృహం కూల్చివేత నోటీసులపై లింగమనేని రమేష్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ఐదు పేజీల లేఖ రాశారు. తన ఇంటి కోసం అన్ని రకాల అనుమతులు తీసుకున్నానని, నిబంధనలు పక్కాగా పాటించానని లేఖలో రాశారు లింగమనేని. కూల్చివేతల ధోరణి వల్ల తన ఒక్క కుటుంబమే ప్రభావితం కాదని, రాష్ట్ర ప్రజలందరూ అవుతారన్నారు. నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ రాజధాని ప్రాంతంలో లక్షలాది మందిని నిరాశనిస్పృహల్లోకి నెట్టేసిందని లేఖలో పేర్కొన్నారు లింగమనేని.

ఉండవల్లిలోని అతిథిగృహానికి 2012లోనే చట్టపరమైన అన్ని అనుమతులతో పాటు ఇరిగేషన్‌ శాఖలోని కృష్ణా సెంట్రల్‌ డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ నుంచి ఎన్‌వోసీ కూడా తీసుకున్నామని, 2014లో ఇక్కడి నుంచి పరిపాలన సాగించే ముఖ్యమంత్రికి అవసరమైన నివాసం లేకపోవడంతో కరకట్ట మీదున్న తన గెస్ట్‌ హౌస్‌ను అధికార నివాసానికి ఇచ్చానన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ, ఆర్థిక సంబంధిత ఆలోచనలు ఇందుల్లేవన్నారు.

లింగమనేని లేఖపై మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే స్పందించారు. లేఖలో పేర్కొన్న విషయాలన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. చంద్రబాబు వల్ల లబ్ది పొందకుంటే తన ఇంటిని ఎందుకిచ్చారో చెప్పాలన్నారు. అక్రమంగా భవనాలు కట్టారు కాబట్టే ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందన్నారు. చుక్కల భూముల్లో కూడా వెంచర్లు వేసిన లింగమనేని ఎక్కడెక్కడ ఎన్ని ప్రభుత్వ భూముల్ని కొల్లగొట్టారో లెక్కలతో చెబునన్నారు. మొత్తానికి కరకట్టపై అక్రమ కట్టడాల కూల్చివేత వ్యవహారాలు రాజకీయాలను ఎటు నుంచి ఎటు వైపు మళ్లిస్తాయోనని రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News