ఏపీలో మొదలైన మరో రాజకీయం.. నెక్ట్స్‌ ఆయనపై వేటు వేసే అవకాశం ?

Update: 2020-02-11 06:42 GMT
ఏపీలో మొదలైన మరో రాజకీయం.. నెక్ట్స్‌ ఆయనపై వేటు వేసే అవకాశం ?

ఏపీలో మరో రాజకీయం మొదలైంది. అమరావతి రైతులు వ్యవహారం కొలిక్కి రాకముందే ఇప్పుడు ఐపీఎస్‌ అధికారిపై వేటు వ్యవహారం అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ప్రజల రక్షణ కోసం కాకుండా చంద్రబాబు ప్రయోజనాల కోసం పనిచేశారని, చంద్రబాబు హయాంలో కోట్లు కూడబెట్టాడని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారం చర్చగా మారింది టీడీపీ నేతలు ఈ సస్పెన్షన్‌ను తీవ్రంగా తప్పుబడుతున్నారు. అయితే, వైసీపీ నేతలు మాత్రం పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో కోట్లు కూడబెట్టాడని, వెంకటేశ్వరరావు వ్యవహారంపై కేంద్రం స్పందించి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో ఏబీ వెంకటేశ్వరరావు కోట్లు సంపాదించాడని, వెయ్యి కోట్లతో బెంగుళూరులో బిజినెస్ చేస్తున్నాడని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పారు. తెలంగాణలో వందల ఎకరాల కబ్జాకు పాల్పడ్డాడని, వెంకటేశ్వరరావు అవినీతి తిమింగలమని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో వెంకటేశ్వరరావు ఎలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నది టీడీపీ ఎంపీలే ట్విట్టర్‌లో వెల్లడిస్తున్నారని విమర్శించారు మంత్రి అనిల్.

మరోవైపు.. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ అధికారులపై కక్షసాధింపు మంచిది కాదని ప్రభుత్వానికి హితవుపలికారు. ఇంతటి దుర్మార్గమైన పాలన దేశంలో ఎక్కడా చూడలేదని మండిపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలకు స్పందించిన మంత్రి బొత్స..రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిన అధికారి గురించి మాట్లాడుతున్నారు గానీ, కేంద్రం గత 5 రోజులుగా చేస్తున్న రైడ్స్‌పై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మొత్తంమీద ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారం ఇరు పార్టీల్లో వివాదాస్పదంగా మారింది. ఏవీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసిన జగన్ సర్కార్, నెక్ట్స్‌ చంద్రబాబు పీఎ శ్రీనివాస్‌‌పైనా వేటు వేసే అవకాశం కనిపిస్తోంది.  

Tags:    

Similar News