కన్నతల్లే చంపేసిందా.. ఆకలికి తట్టుకోలేక కన్నుమూసిందా?

Update: 2020-02-11 11:51 GMT
కన్నతల్లే చంపేసిందా.. ఆకలికి తట్టుకోలేక కన్నుమూసిందా?

అత్తమామలతో గొడవ పడింది తనకు చెప్పకుండా తన బంగారాన్ని ఆడపడుచుకు ఇచ్చేశారంటూ తీవ్ర మనస్తాపానికి గురైంది మరోవైపు, అత్తమామల సూటిపోటి మాటలతో ఇక తనువు చాలించాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడువుగా తనకున్న ఏడాదిన్నర పాపను తీసుకుని తన ఇంటి వెనుకున్న ఎత్తయిన కొండ ఎక్కింది, మూడ్రోజులపాటు కొండ దగ్గరే తిరుగుతూ గడిపింది అయితే, ఆహారం నీళ్లూ లేక సొమ్మసిల్లిపడిపోయింది, చివరికి గొర్రెల కాపరులు ఆమెను గమనించి ఆహారం నీళ్లు ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమెను మూడ్రోజుల క్రితం అదృశ్యమైన సుమలతగా గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అయితే, తల్లి క్షేమంగానే దొరికినా తనతో తీసుకొచ్చిన పాప ఏమైందో మిస్టరీగా మారింది.

ఇదిలా ఉంటే, సుమలత, చిన్నారి జ్ఞానస కనిపించడం లేదంటూ ఫిబ్రవరి 7న కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుమలత, చిన్నారి జ్ఞానస కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, మూడ్రోజుల తర్వాత అనూహ్యంగా గొర్రెల కాపరుల ద్వారా సుమలత ఆచూకీ లభించగా, ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం సుమలత పరిస్థితి బాగానే ఉందని పోలీసులు వెల్లడించారు. అయితే, చిన్నారి జ్ఞానస ఎక్కడంటూ తల్లి సుమలతను పోలీసులు ప్రశ్నించగా మూడ్రోజులపాటు అన్నం నీళ్లు లేకపోవడంతో ఏడ్చిఏడ్చి చనిపోయిందని తానే అక్కడ గొయ్యి తీసి పూడ్చేశానని తెలిపింది.

తల్లి సుమలత ఇచ్చిన సమాచారంతో పెందుర్తి ఎర్రకొండ పరిసరాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్ తో కొండను కొండ కిందనున్న పరిసరాలను జల్లెడ పట్టారు. అయితే, సుమలత చెప్పినట్లుగా ఎక్కడా చిన్నారి ఆచూకీ లభించలేదు దాంతో, మరోసారి పెందుర్తి ఎర్రకొండ పరిసరాల్లో మరోసారి గాలింపు చర్యలు చేపట్టారు. ఇలా, రెండు మూడుసార్లు ఎర్రకొండ పరిసరాలను జల్లెడ పట్టిన పాప ఆచూకీ దొరకకపోవడంతో అసలు చిన్నారి ఏమైందనేది మిస్టరీగా మారింది.

అయితే, తల్లి సుమలత చెప్పినట్లుగా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో అసలు జ్ఞానస ఏమైందనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇంతకీ జ్ఞానస చనిపోయిందా? లేక తల్లి సుమలత అబద్ధం చెబుతోందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Full View

 

Tags:    

Similar News