Viral Video: రోడ్డు దాటించిన వ్యక్తికి ఏనుగుల థాంక్స్ ఇలా..
Viral Video: తమను రోడ్డు దాటడానికి సహకరించిన ఒక వ్యక్తికి ఏనుగుల గుంపులోని పెద్ద ఏనుగులు కృతఙ్ఞతలు చెబుతున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Viral Video
Viral Video: ఏనుగులను చూస్తే అతి పెద్దగా చూడటానికి అమ్మో అనిపించేలా ఉంటాయి. కానీ, అవి మనతో చాలా ముద్దుగా వ్యవహరిస్తాయి. సులువుగా మచ్చిక అయిపోతాయి. దగ్గరకు వెళితే తొండంతో పలకరిస్తాయి. ఎక్కడైనా అకస్మాత్తుగా ఒక ఏనుగు కనిపిస్తే చిన్న పిల్లలు సంబరంతో గెంతులు వేయడం అటుంచితే, పెద్దవాళ్ళు కూడా ఆ కాసేపు చిన్న పిల్లలు అయిపోతారు. ఏనుగు గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది. మనుషులతో అది వ్యవహరించే తీరు భలే ఉంటుంది. ఆలయాల దగ్గర ఉన్న ఏనుగులు మన తలపై తొండంతో చేసే ఆశీర్వచనం సాక్షాత్తూ భగవంతుని ఆశీస్సులుగానే భావిస్తాం. ప్రేమగా మనం ఏనుగు తాకితే అంతకు రెట్టింపు ప్రేమతో మనకు తొండంతో బదులిస్తుంది ఏనుగు. అడవిలో ఏనుగుల గుంపు.. ఆ గుంపులో చిన్న ఏనుగులను చూస్తే అసలు మనసు సంతోషంతో పులకరించిపోతుంది.
అలా అడవుల్లో తిరుగుతున్న ఏనుగుల గుంపు ఒక రోడ్డు దాటాల్సి వచ్చింది. అటూ, ఇటూ వాహనాలు హడావుడిగా పరుగులు తీస్తున్నాయి. పాపం వాటి కోసం అవి ఆగవు అనే విషయం వాటికి తెలీదు కదా. రోడ్డు దాటి అవతల పక్కకు ఎలా వెళ్ళాలి? సరిగ్గా అప్పుడు ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. అటూ ఇటూ వెళుతున్న వాహనాలను రోడ్డుకు అడ్డుగా తాను నిలబడి అడ్డుకున్నాడు. వాటిని ఆగేలా చేశాడు. ఏనుగులకు రోడ్డు దాటేలా క్లియర్ చేశాడు. దీంతో ఏనుగులన్నీ సంతోషంతో రోడ్డు దాటడం మొదలు పెట్టాయి. చాలా ఏనుగులు వడి, వడిగా రోడ్డు దాటాయి. చివరిలో ఉన్న ఏనుగులు మాత్రం రోడ్డు దాటుతూ తమకు సహాయం చేసిన వ్యక్తికి తొండంతో సెల్యూట్ చేస్తూ ముందుకు వెళ్లాయి. వాటికి ఆ వ్యక్తి కూడా చేతిని ఊపుతూ బై చెప్పాడు.
వైరల్ అవుతున్న ఈ వీడియోను రిటైర్డ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా తన ఎక్స్ అకౌంట్ @susantananda3లో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పటికే పది లక్షలకు పైగా వ్యూస్ తెచ్చుకుంది. వీడియో చూసిన నెటిజన్లు ఏనుగు సంస్కారానికి హ్యాట్సాఫ్ అంటున్నారు. సహాయం చేసిన వ్యక్తికి కృతఙ్ఞతలు తెలిపిన ఆ ఏనుగులను శభాష్ అంటూ పొగిడేస్తున్నారు. ఇదిగో ఈ వీడియో మీరూ ఇక్కడ చూసేయండి..




