Weather Update : తెలుగు రాష్ట్రాల్లో వడగళ్ల వాన బీభత్సం.. మరో నాలుగు రోజులు రెయిన్ అలర్ట్
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజులు వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అకాల వర్షాలతో ఏపీ, తెలంగాణలో మామిడి, మిర్చి పంటలకు భారీ నష్టం వాటిల్లింది.
Weather Update
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఎండవేడితో అల్లాడిపోతున్న జనాన్ని పలకరిస్తూ అకాల వర్షాలు కుమ్మేస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం, నైరుతి గాలుల ప్రభావంతో అటు ఏపీ, ఇటు తెలంగాణలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. అయితే ఈ చల్లదనం వెనుక వడగళ్ల వానలు, పిడుగుల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక సమాచారం అందించింది. రాబోయే నాలుగు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ద్రోణి, నైరుతి గాలుల ప్రభావంతో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని వల్ల ఆకస్మిక వర్షాలు, పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా వర్షం పడే సమయంలో చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల దగ్గర గానీ నిలబడవద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ప్రజలకు సూచించారు.
తెలంగాణలో వడగళ్ల వానల హెచ్చరిక
తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వడగళ్ల వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఖమ్మం, వికారాబాద్, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. రానున్న గంటల్లో సంగారెడ్డి, కామారెడ్డి, ములుగు, నాగర్‌కర్నూల్, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ జిల్లాల్లో గాలివానల వల్ల చెట్లు విరిగిపడే ప్రమాదం ఉందని, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఏపీలోని అన్ని జిల్లాలకు రెయిన్ అలర్ట్
ఆంధ్రప్రదేశ్‌లో కూడా వర్షాల జోరు కొనసాగనుంది. విపత్తుల నిర్వహణ శాఖ దాదాపు అన్ని జిల్లాలకు వర్ష సూచన జారీ చేసింది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు అంటే.. రాయలసీమ, కోస్తాంధ్రలోని మెజారిటీ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, ప్రకాశం వంటి జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడవచ్చు. కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మాత్రం గాలివాన ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
కన్నీరు మున్నీరవుతున్న రైతన్నలు
ఒకవైపు ప్రజలకు ఎండల నుంచి ఉపశమనం లభించినా, రైతన్నలకు మాత్రం ఈ వర్షాలు తీరని శోకాన్ని మిగిల్చాయి. అకాల వర్షాల వల్ల మామిడి తోటల్లో కాయలన్నీ నేలరాలాయి. చేతికొచ్చిన పంట కళ్లముందే నాశనం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు కళ్లాల్లో ఆరబెట్టిన మిర్చి తడిసి ముద్దవడంతో నాణ్యత దెబ్బతిని, ధర తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గాలివానల వల్ల అపార నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.




