Rangareddy: అమ్మ శవం పక్కనే చిన్నారి రోదన.. రంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య!

Rangareddy: నిర్జన ప్రాంతం.. చుట్టూ కమ్ముకున్న చీకటి.. పక్కనే రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న తల్లి.

Arun Chilukuri
Published on: 23 March 2026 11:05 AM IST
Rangareddy
X

Rangareddy: అమ్మ శవం పక్కనే చిన్నారి రోదన.. రంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య!

Rangareddy: నిర్జన ప్రాంతం.. చుట్టూ కమ్ముకున్న చీకటి.. పక్కనే రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న తల్లి. ఏం జరుగుతుందో తెలియని వయసు.. అమ్మ ఎందుకు లేవడం లేదో అర్థం కాక, ఆకలితో, భయంతో రాత్రంతా ఆ పసికందు ఏడుస్తూనే ఉంది. తెల్లవారిన తర్వాత అటుగా వెళ్లిన స్థానికులు ఆ దృశ్యాన్ని చూసి చలించిపోయారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌ మండలం దేవునిపల్లి పరిధిలోని రంగారెడ్డిగూడలో ఆదివారం ఈ విషాద ఘటన వెలుగుచూసింది.

ఘటన వివరాల్లోకి వెళ్తే..

రంగారెడ్డిగూడకు చెందిన శోభ (31) అనే మహిళకు పదేళ్ల క్రితం మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిలకొండకు చెందిన వ్యక్తితో వివాహమైంది. వీరికి ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే, మనస్పర్థల కారణంగా మూడేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయిన శోభ, అదే గ్రామానికి చెందిన నర్సింహులు అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. వీరిద్దరికీ మమత (రెండున్నరేళ్లు) అనే కుమార్తె జన్మించింది. గత కొంతకాలంగా నర్సింహులుతో కూడా గొడవలు రావడంతో శోభ తన పుట్టింటికి వచ్చి తల్లితో ఉంటోంది.

సైకిల్ ఇప్పిస్తానని పిలిచి..

శనివారం నాడు నర్సింహులు ఫోన్ చేసి, కుమారుడికి సైకిల్ ఇప్పిస్తానని శోభను షాద్‌నగర్‌కు పిలిచాడు. కుమారుడితో కలిసి అక్కడికి వెళ్లిన శోభ, సాయంత్రం వరకు నర్సింహులు రాకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చేసింది. అనంతరం కుమారుడిని ఇంట్లోనే వదిలి, చిన్నారి మమతను తీసుకుని మళ్లీ కోయిలకొండకు బయలుదేరింది.

ఆదివారం తెల్లవారుజామున రంగారెడ్డిగూడ శివారులోని ఓ పొలంలో శోభ మృతదేహం లభ్యమైంది. దుండగులు ఆమె తలపై బండరాయితో మోది కిరాతకముగా హత్య చేశారు. తెల్లవారుజామున అటుగా వెళ్తున్న గ్రామస్థులు, తల్లి శవం పక్కన ఏడుస్తున్న చిన్నారిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

నర్సింహులుపైనే అనుమానం!

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి తల్లి కరుణమ్మ ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ సీతారాం విచారణ చేపట్టారు. ఈ హత్యలో సహజీవనం చేస్తున్న నర్సింహులు ప్రమేయం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story