Weather Update : భానుడి సెగకు బ్రేక్.. మార్చి 16 నుంచి 23 వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
Weather Update : ద్రోణి ప్రభావంతో మార్చి 16 నుంచి 23 వరకు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురవనున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు కొన్నిచోట్ల వడగండ్ల వాన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Rain Alert
Weather Update : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండగా, వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఆకాశంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. మార్చి 16 నుంచి 23వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్‌లలో మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ వడగండ్ల వాన (Hailstorms) పడే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం ఎండలు మండుతున్నప్పటికీ, రాబోయే నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులు వేడి నుంచి కాస్త ఉపశమనాన్ని కలిగిస్తాయి. అయితే, మార్చి 18, 19 తేదీల్లో వర్షాల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ విశ్లేషకులు చెబుతున్నారు. ఆకాశం మేఘావృతమై ఉండటం వల్ల ఉక్కపోత నుంచి కూడా రిలీఫ్ లభించనుంది. కానీ, అకాల వర్షాల వల్ల కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా వాతావరణ అనిశ్చితి నెలకొంది. ఆది, సోమవారాల్లో కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంది. మార్చి 17వ తేదీ నుంచి ఏపీలో వర్షాల తీవ్రత పెరగనుంది. ముఖ్యంగా మార్చి 19న రాయలసీమలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. శనివారం నాడు అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ఎండలు మండిపోయాయి. ప్రకాశం జిల్లా పిటికాయగుల్లలో గరిష్టంగా 40.17 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఎండల నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షాలు ప్రజలకు తక్షణ ఉపశమనాన్ని ఇవ్వనున్నాయి.
వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ కోరింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున వర్షం కురుస్తున్న సమయంలో చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని హెచ్చరించింది. ధాన్యం ఆరబోసిన రైతులు వర్షం నుంచి తడవకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించింది. రాబోయే వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం దోబూచులాడనుంది.




