Weather Update : హైదరాబాద్‌లో చల్లబడిన వాతావరణం.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Weather Update : తెలుగు రాష్ట్రాల్లో ద్రోణి ప్రభావంతో మరో 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ కాగా, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

CR Reddy
Published on: 20 March 2026 6:33 AM IST
Weather Update
X

Weather Update

Weather Update : తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. మార్చి నెల అంటేనే సెగలు గక్కే ఎండలతో జనాలు అల్లాడిపోవాలి, కానీ సీన్ రివర్స్ అయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వాతావరణం చల్లబడింది. రానున్న 24 గంటల నుంచి నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

హైదరాబాద్‌లో మారిన వాతావరణం

గ్రేటర్ హైదరాబాద్‌పై వరుణుడు కన్నేశాడు. సాధారణంగా మార్చిలో 40 డిగ్రీలకు చేరువవ్వాల్సిన ఉష్ణోగ్రతలు ఇప్పుడు 30 డిగ్రీల లోపే నమోదవుతున్నాయి. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 28.4 డిగ్రీలుగా నమోదైంది, ఇది సాధారణం కంటే 8 డిగ్రీలు తక్కువ కావడం గమనార్హం. రానున్న 24 గంటల్లో నగరంలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఎండ తీవ్రత అస్సలు కనిపించడం లేదు. గాలిలో తేమ 54 శాతంగా నమోదైంది.

తెలంగాణ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్

తెలంగాణలోని ఉత్తర జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, జగిత్యాల జిల్లాల్లో రానున్న గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే ఖమ్మం, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వానలు మొదలయ్యాయి. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున రైతులు, ప్రజలు చెట్ల కింద నిలబడకూడదని సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌లోనూ మూడు రోజుల పాటు వానలు

అటు ఏపీలోనూ వర్షాల ప్రభావం బలంగా ఉంది. అమరావతి వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం.. ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలో ఇవాల్టి నుంచి మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయి. గంటకు గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు పడే అవకాశం ఉన్నందున బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

కన్నీరు పెడుతున్న రైతన్న

ఈ అకాల వర్షాలు అన్నదాతకు కోలుకోలేని దెబ్బ తీశాయి. పంట చేతికి వచ్చే సమయంలో వడగండ్ల వానలు కురవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గాలివాన తీవ్రతకు మామిడి తోటలు దెబ్బతిన్నాయి, కాయలన్నీ నేలపాలయ్యాయి. ఇక పొలాల్లో ఆరబెట్టిన మిర్చి వర్షానికి తడిసి ముద్దవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆకాశం నుంచి పడుతున్నది వాన చినుకులు కాదని, తమ కన్నీటి చుక్కలని రైతులు ఆవేదన చెందుతున్నారు.

CR Reddy

CR Reddy

Next Story